- నిర్మల్ జిల్లాలోని గంజాయి అడ్డాలపై పోలీస్ డాగ్ స్వ్కాడ్స్ తనిఖీలు
- పాత నిందితులకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో కొంత కాలం నుంచి గంజాయి దిగుమతి, వినియోగం, సాగు విపరీతంగా పెరిగిపోతోంది. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో డీఎస్‌పీ గంగారెడ్డి, రూరల్ ఇన్స్ పెక్టర్ పోలీసు జాగిలాలను రంగంలోకి దించి విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయా ప్రాంతాల్లో దాడులు జరిపి పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకుని పలువురుపై కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ మార్పు కనిపించకపోవడంపై ఎస్పీ గంజాయి కట్టడి చేయడంపై సీరియస్ గా దృష్టి సారించారు.
ఇందులో భాగంగానే ఆపరేషన్ గాంజా పేరిట గంజాయి అడ్డాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో ఉన్న ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గత శనివారం ఉదయం ఇన్ ఫార్మర్లు అందించిన సమాచారం తో నిర్మల్ పట్టణంలోని వైఎస్సార్ కాలనీ లో పోలీసులు ఆకస్మిక రైడ్స్ చేపట్టారు. కాలనీ శివారు ప్రాంతాల్లోని ఇండ్లలోనూ పాత ఇంటి భవనాలలోనూ, ఆటోలు, కార్లు లాంటి వాహనాలను సైతం పోలీసు జాగిలాలతో తనిఖీ చేయించారు. అయితే ఈ తనిఖీలలో గంజాయి పట్టుబడనప్పటికీ ఆ ప్రాంతంలో గంజాయి అమ్మే వారిలో భయాందోళనలు నెలకొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో పాటు గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడ్డ పాత నిందితుల ఇళ్లకు వెళ్లిన పోలీసులు వారికి కౌన్సెలింగ్ తో పాటు గం జాయి వల్ల జరిగే నష్టాన్ని వివరించి అవగాహన కల్పించారు.
ALSO READ : డ్రంకెన్ డ్రైవ్లో దొరికిన వాళ్లలో 85 శాతం యువతే
ఇన్ఫార్మర్ల నెట్ వర్క్ ఏర్పాటు
గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాల విక్రయాలు, రవాణా, సాగుతో బాటు వినియోగాన్ని అరికట్టేందుకు అనుమానిత ప్రాంతాల్లో ఇన్ ఫార్మర్ల నెట్‌వర్క్ ను విస్తృతం చేయాలని పోలీసులు నిర్ణయించారు. పట్టణ ప్రాంతాలలోని స్లమ్ ఏరియాలలో ఈ ఇన్‌పార్మర్ల నెట్‌వర్క్ ద్వారా గం జాయితోపాటు డ్రగ్స్ అమ్మే వారి పైనే కాకుండా వాటిని విక్రయించే వారి సమాచారాన్ని ఎప్పటి కప్పుడు సేకరించనున్నారు. దీనికనుగుణంగా ఇక వరుస దాడులు చేపట్టి గంజాయి వినియోగాన్ని, అమ్మకాలను పూర్తిస్థాయిలో అరికట్టాలని పోలీసులు నిర్ణయించారు. రాబోయే ఆరు నెలల పాటు ఆపరేషన్ గాంజాను నిరాటంకంగా కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు.