పసుపుల వంతెన ఇంతేనా.? కట్టిన మూడేండ్లకే వరదల ధాటికి కుప్పకూలిన బ్రిడ్జి

పసుపుల వంతెన ఇంతేనా.? కట్టిన మూడేండ్లకే వరదల ధాటికి కుప్పకూలిన బ్రిడ్జి
  • రెండేళ్లయినా పునర్నిర్మాణం చేయని అధికారులు
  • ఎనిమిది గిరిజన గ్రామాల పరిస్థితి దయనీయం
  • వాగు నీటిలోంచే నడుస్తూ సాహస ప్రయాణం 
  • దొత్తి వాగు వంతెన నిర్మాణానికి అటవీ అనుమతుల శాపం

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మారుమూల గ్రామమైన పసుపుల వాగుపై నిర్మించిన వంతెన మూడేండ్లకే కుప్పకూలింది. ఏండ్లుగా వాగుపై వంతెన నిర్మించాలని స్థానిక గ్రామాల ప్రజల డిమాండ్ మేరకు రూ. 8 కోట్లతో ఐదేండ్ల కింద పసుపుల వాగుపై బ్రిడ్జి  నిర్మించారు. దీంతో దాదాపు 8 గ్రామాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే బ్రిడ్జి రెండేండ్ల కింద కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల ధాటికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. 

బ్రిడ్జిని నిర్మించిన మూడేండ్లకే వరదల కారణంగా కుప్పకూలిపోగా నిర్మాణంలోని డొల్లతనం బయటపడింది. అప్పట్లో ఆర్అండ్ బీ అధికారులు విచారణ చేసి నివేదిక ఇచ్చినా మూలకు పడేశారు. ఏండ్లు గడుస్తున్నా మళ్లీ బ్రిడ్జిని  పునర్నిర్మించలేదు. కనీసం అంచనాలు కూడా రూపొందించలేదు. మరో రెండు మూడు నెలల్లో వానాకాలం రానున్నందున ఎనిమిది గ్రామాల ప్రజలు రాకపోకలపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం స్పందించి వెంటనే వంతెన నిర్మించాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

ఎట్టకేలకు వంతెన నిర్మించినా..
పసుపుల వంతెన వరదలకు కొట్టుకుపోవడంతో దానిపైనుంచి రాకపోకలు సాగించే 8 గిరిజన గ్రామాల ప్రజలు మళ్లీ కష్టాలు తప్పడంలేదు. మండలంలోని పసుపుల గ్రామంతో పాటు హరిచంద్ తండా, తులసిపేట, అంకెన, రాయదారి, పోచంపాడు తదితర గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా వాగులు దాటుతూనే గ్రామాలకు చేరుకునేవారు. 

ఎట్టకేలకు వంతెన  నిర్మించినా మూడేండ్లు కూడా వినియోగపడలేదు. వంతెన కొట్టుకుపోయి రెండేండ్లు గడిచినా ఇప్పటివరకు ప్రజా ప్రతినిధు లు, సంబంధిత శాఖల అధికారులు పునర్ నిర్మించేందుకు చర్యలు తీసుకోకపోవడంపై ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరో 8 గ్రామాలది అదే పరిస్థితి..
పెంబి మండలంలోని మరో ఎనిమిది గ్రామాల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. దోత్తి వాగుపై వంతెన నిర్మించకపోవడంతో దశాబ్దాలుగా వాగులను దాటుతూ గ్రామాల కు చేరుకుంటున్న దుస్థితి నెలకొంది. వాగుపై బ్రిడ్జి నిర్మించకపోతుండగా.. యాపలగూ డెం, రామ్ నగర్, సత్తుగూడ, నాయక్ గూడెం, దూందరి, వస్సుపల్లి, చాకిరేవు తదితర గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగడం లేదు. 

డిజైన్, క్వాలిటీ లోపాలపై రిపోర్ట్ ఇచ్చినా.. 
ఐదేండ్ల కింద నిర్మించిన పసుపుల వంతెన పూర్తిగా డిజైన్, క్వాలిటీ లోపాలతోనే వరదలకు కొట్టుకుపోయిందని ఆర్అండ్ బీ అధికారులు నిర్ధారించారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు నివేదికలు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సదరు కాంట్రాక్టర్ బిల్లులు కూడా చెల్లించేశారు. 

ఆర్అండ్ బీ క్వాలిటీ కంట్రోల్ రూల్ మేరకు పసుపుల వంతెన కనీసం 20 ఏండ్ల వరకు పటిష్టంగా ఉండాలి. కాగా.. డిజైన్, నాణ్యతలోపం కారణంగా నిర్మించిన మూడేండ్లకే వంతెన వరదల ధాటికి కొట్టుకుపోయింది. ఇప్పటివరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.