
కడెం, వెలుగు : రోడ్డు సౌకర్యం కల్పించిన తర్వాతే తమ గ్రామంలోకి అడుగుపెట్టాలంటూ నిర్మల్ జిల్లా కడెం మండలంలోని గంగాపూర్ గ్రామస్తులు అధికారులను అడ్డుకున్నారు. వసతులు కల్పించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ గ్రామంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదని పోలింగ్ కేంద్రం ఏర్పాటు కోసం వెళ్లిన అధికారులకు వారు తెగేసి చెప్పారు. గంగాపూర్లో పోలింగ్కేంద్రం ఏర్పాటు కోసం తహసీల్దార్రాజేశ్వరితో కూడిన అధికారుల బృందం మంగళవారం వెళ్లింది.
అధికారులు వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు ఒక దగ్గర చేరి వారిని గ్రామంలోకి రానివ్వలేదు. ఊరికి రోడ్డు సౌకర్యం కల్పించే వరకు అధికారులు రాకూడదని స్పష్టం చేశారు. రోడ్డు, బ్రిడ్జి సౌకర్యం కల్పించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే నాయకులు, అధికారులకు తమ గ్రామం గుర్తుకు వస్తుందని, ఆ తర్వాత సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు వారి చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులకు తహసీల్దార్ రాజేశ్వరి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. దీంతో అధికారులు వెనుదిరిగారు.