నిర్మల్,వెలుగు: జిల్లా ప్రజలు సర్ది, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఒక్కొక్కరు కనీసం వారం తగ్గకుండా మంచంపడుతున్నారు. చాలా మంది హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్‌తో పాటు 17 పీహెచ్‌సీలు రోగులతో నిండిపోయాయి. ఔట్పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు. పీఎంపీలు, ఆర్ఎంపీల క్లినిక్‌లు జ్వరపీడితులతో కిక్కిరుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్సీలలో శుక్రవారం ఒక రోజే 1,680 మంది మంది ఔట్పేషెంట్ల సంఖ్య నమోదైంది. 64 మంది ఇన్పేషెంట్లుగా చేరారు. బాధితులందరూ వైరల్ ఫీవర్స్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో రోజూ 500 మందికి పైగా జ్వర పీడితులు వస్తున్నట్లు వివరించారు.
ప్రైవేట్ దందా..
జిల్లాలోని కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ల నిర్వాహకులు అవసరం ఉన్నా.. లేకున్నా టెస్టుల పేరిట డబ్బులు గుంజుతున్నారు. ఇష్టమొచ్చినట్లు యాంటీబయాటిక్స్ఇస్తున్నారు. వైరల్ ఫీవర్స్ విస్తరిస్తుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మందులు పంపిణీ చేస్తున్నారు.
మార్పులే కారణం..
వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయి. పరిస్థితి అదుపు చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నాం. ఆశా వర్కర్లతో వివరాలు సేకరించి అవసరం ఉన్న చోట వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తుగా క్యాంప్‌లు ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేస్తున్నాం.
– డాక్టర్ ధనరాజ్,డీఎం అండ్ హెచ్ వో, నిర్మల్