
నిర్మల్, వెలుగు: నిర్మల్‌లోని చారిత్రక గొలుసుకట్టు చెరువు భూముల విస్తీర్ణాన్ని గుర్తించినా వాటి ఆక్రమణలను మాత్రం అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. ఇక్కడి గొలుసు కట్టు చెరువుల విస్తీర్ణంతో పాటు శిఖ౦, ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లను రెవెన్యూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు గుర్తించారు. కొన్నేళ్ల నుంచి గొలుసుకట్టు చెరువు భూముల ఆక్రమణ పెద్దఎత్తున జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆక్రమణలపై కొంతమంది రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించడంతో జిల్లా యంత్రాంగం ఈ భూముల నిర్ధారణ, రక్షణకు చర్యలు చేపట్టింది . దీని కోసం చెరువు భూములపై డీజీపీఎస్ విధానంతో సర్వే చేపట్టారు. మొత్తం పదకొండు గొలుసుకట్టు చెరువుల సర్వే చేపట్టి విస్తీర్ణాన్ని నిర్ధారించారు.
విస్తీర్ణం ఇది..
బ౦గల్ పేట చెరువు 210.32 ఎకరాలు, ఖజానా చెరువు 98 .22 ఎకరాలు , కొత్త చెరువు 33.11 ఎకరాలు, రాంసాగర్ 3723 ఎకరాలు, జాపూర్ కుర్రనపేట చెరువు 7618 ఎకరాలు, సీతాసాగర్ గొల్లపేట చెరువు 48.11 ఎకరాలు, ఇబ్రహీం చెరువు 76.18 ఎకరాలు, క౦చరోని చెరువు 74.19 ఎకరాలు, ధర్మసాగర్ చెరువు 65.10 ఎకరాలు, మోతి తలాబ్ 132.06 ఎకరాలు, చిన్న చెరువు మంజులాపూర్ 81.34 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారులు తేల్చారు. చెరువు శిఖంతో బాటు ఎఫ్టీఎల్‌ను గుర్తించిన అధికారులు ఎఫ్టీఎల్ నుంచి తొంభై అడుగుల దూరం వరకు బఫర్ జోన్‌గా నిర్ధారించారు. ఈ బఫర్ జోన్ వరకు ఎలాంటి నిర్మాణాలు చేయకూడదన్న నిబంధన ఉంది.
బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలకు గానీ రియల్ వెంచర్లకు గానీ సంబంధిత ఇరిగేషన్ శాఖ ఎన్ఓసీలను జారీ చేయకూడదు. మున్సిపాలిటీ అధికారులు నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయకూడదని నిబంధనలు విధించారు. చెరువు భూముల నిర్ధారణతో ఇక ఆక్రమణలకు అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు భావించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సంబంధిత అధికారులు చెరువు భూములకు హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో కొద్ది రోజులపాటు చెరువు భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం మళ్లీ కొంతమంది ఈ హద్దులను చెరిపేస్తూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. అప్పట్లో హద్దులు నిర్ణయించిన అధికారులు బదిలీ కావడంతో కొత్త అధికారులకు ఈ చెరువుల హద్దులపై పెద్దగా అవగాహన లేకపోవడం కబ్జాదారులకు కలిసొస్తుందంటున్నారు.
హద్దులను చెరిపేస్తున్నారు..
కాగా నిర్మల్ చుట్టూరా ఉన్న గొలుసుకట్టు చెరువుల ఆక్రమణలపై గతంలో ఓ న్యాయవాది రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇక్కడి చెరువుల ఆక్రమణలపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. జిల్లా కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తిని చెరువుల ఆక్రమణలపై పరిశీలించాలంటూ సూచించింది. అయితే రాష్ట్ర హైకోర్టు కలెక్టర్ కు హెచ్చరికలు జారీ చేయడంతో యంత్రాంగం ఒక్కసారి కదిలింది.
హుటాహుటిన జీపీఎస్ విధానంతో చెరువు భూముల సర్వేలు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ హద్దుల ఆధారంగా ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయడం, ట్రెంచ్‌లను తవ్వడం లాంటి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కబ్జాదారులు కంచరోని చెరువు, ధర్మసాగర్, సీతాసాగర్, పల్లె చెరువు భూములపై మళ్లీ కన్నేశారు. క్రమంగా చెరువు భూములకు ఆనుకొని ఉన్న పట్టా భూముల సర్వే నంబర్ పేరుతో ఈ భూములను కూడా కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల చెరువులో వెంచర్లు వేయడం మొదలుపెట్టారు. చెరువు భూముల్లో ఆక్రమణ బహిరంగంగా జరుగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కబ్జాదారులు మరింత రెచ్చిపోతున్నారంటున్నారు.