అధికారంలోకి రాగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తామని కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. నిర్మల్ లో ఇన్ని రోజులుగా మంత్రి పదవి అనుభవించిన ఇంద్రకరణ్ రెడ్డి చుట్టూ ఉన్న చెరువులను సైతం కబ్జా చేశారని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ తిన్న ప్రతి పైసా కక్కిస్తామన్నారు.
ఈ ఎన్నికల్లో శ్రీహరి రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణలో ప్రజలు గెలవాలంటే.. చేతి గుర్తుకే ఓటు వేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని ఆరు అంశాలను విజయశాంతి ప్రజలకు వివరించారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ కాంగ్రెస్ నేత విజయశాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి కూచాడి శ్రీహరి రావ్ కు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా విజయశాంతిని చూడడానికి కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.