ఔషధ మొక్కలపెంపకానికి డీఆర్డీఏ యాక్షన్​ ప్లాన్​.. పైలట్​ ప్రాజెక్ట్​గా నిర్మల్​ జిల్లా ఎంపిక

ఔషధ మొక్కలపెంపకానికి డీఆర్డీఏ యాక్షన్​ ప్లాన్​.. పైలట్​ ప్రాజెక్ట్​గా నిర్మల్​ జిల్లా ఎంపిక
  • హార్టికల్చర్, డీఆర్డీఏల ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ 
  • పైలట్ ప్రాజెక్టుగా నిర్మల్ జిల్లా ఎంపిక
  • వన మహోత్సవం సందర్భంగా ప్రచారానికి కసరత్తు 

నిర్మల్, వెలుగు:  హోమ్ ప్లాంట్స్ పేరిట ఔషధ మొక్కల పెంపకం చేపట్టేందు హార్టికల్చర్, గ్రామీణాభివృద్ధి (డీఆర్డీఏ) శాఖలు సంయుక్తంగా ఓ యాక్షన్ ప్లాన్ రూపొందించాయి. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. వన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఔషధ మొక్కల పెంపకంపై విస్తృత ప్రచారం చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటికే డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని నాలుగు చోట్ల కొండాపూర్ సమీకృత వ్యవసాయ క్షేత్రం, కడ్తాల్, రత్నాపూర్ కాండ్లి, కడెం నర్సరీల్లో పలు రకాల ఔషధ మొక్కలు పెంచుతున్నారు.  వాటి ప్రాధాన్యతను వివరించేందుకు గ్రామాలు, వార్డుల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించబోతున్నారు. నర్సరీల్లో పెంచుతున్న ఈ మొక్కలను ప్రతీ ఇంటికి పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.    

ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలు..

 అనేక ఔషధ గుణాలతోపాటు పలు రకాల విటమిన్లు కలిగిన ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కల పెంపకానికి ఈసారి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కొమ్మ కత్తిరింపు విధానంలో నర్సరీల్లో వీటిని పెంచుతున్నారు. దాదాపు 2 వేలకు పైగా ప్లాంటేషన్​కు సిద్ధంగా ఉన్నాయి. ఫ్యాషన్ ఫ్రూట్​లో సీ విటమిన్, కాల్షియం, పొటాషియం, కే, డీ, బీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్రూట్ తినేవారికి దీర్ఘకాలిక వ్యాధులు, ప్రమాదకరమైన క్యాన్సర్ దరిచేరవని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.  

అలంకరణ మొక్కలు తగ్గించి..

 ఇప్పటివరకు హోం ప్లాంట్స్​లో ఎక్కువగా పూలు, అలంకరణ మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. ఇకనుంచి వాటిని తగ్గించి, ఔషధ మొక్కలైన కలబంద, అశ్వగంధ, కరివేప, నిమ్మ, దానిమ్మ వంటివి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన నాలుగు నర్సరీల్లో ఈ మొక్కలను కూడా పెంచుతున్నారు.

తక్కువ స్థలం, తక్కువ సమయంలో ఇవి పెరగనున్నందున వన మహోత్సవ లక్ష్యం కూడా నెరవేరే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేసే బా ధ్యతను గ్రామీణాభివృద్ధి, హార్టికల్చర్ శాఖలతో పాటు పంచాయతీలు, మున్సిపాలిటీలకు కూడా అప్పగించనున్నారు.