కేజీబీవీల్లో ‘పోలీస్ అక్క’ ప్రోగ్రామ్

కేజీబీవీల్లో ‘పోలీస్ అక్క’ ప్రోగ్రామ్
  • ప్రారంభించిన నిర్మల్ ఎస్పీ  జానకి షర్మిల
  •  జిల్లాలో 18 కేజీబీవీలకు  పోలీస్ కో - ఆర్డినేటర్ల నియామకం

నిర్మల్, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేజీబీవీల్లో బాలికల భద్రతకు నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల సరికొత్త ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టారు. ‘పోలీస్ అక్క’ పేరిట మహిళా పోలీసులు ప్రతి నెలలో ఒకరోజు  స్కూళ్లను సందర్శించి హాస్టల్లో రాత్రి బస చేస్తారు. అంతేకాకుండా విద్యార్థులతో కలిసి భోజనం చేయడం, పరిస్థితులు తెలుసుకోవడం, మానసిక స్థైర్యం కల్పించడంతో పాటు బ్యాడ్ టచ్.. గుడ్ టచ్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు.  

బుధవారం ఎస్పీ జానకి షర్మిల  మహిళా పోలీస్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.  జిల్లాలోని 18 కేజీబీవీలకు ఒక్కో మహిళ పో లీస్ ను కో–ఆర్డినేటర్ గా నియమించారు. తమకు కేటాయించిన కేజీబీవీలను పూర్తిస్థాయిలో దత్తత తీసుకోవడంతో పాటు వారంలో ఒకరోజు మస్ట్ గా సందర్శించాల్సి ఉంటుంది. విద్యార్థినుల్లో  ఆత్మన్యూనతా భావాన్ని తొలగించి మనోధైర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రోగ్రామ్ ను చేపట్టారు.