ఎత్తిపోతలకు పూర్వ వైభవం వచ్చేనా?

ఎత్తిపోతలకు పూర్వ వైభవం వచ్చేనా?
  • అదనంగా 25 వేల ఆయకట్టుకు సాగు నీరందించే లక్ష్యం
  • నిర్వహణ లేక వృథాగా మారిన స్కీమ్స్
  • నిధుల మంజూరుపై ఆశలు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో శిథిలావస్థకు చేరుకొని వృథాగా మారిన 40 ఎత్తిపోతల పథకాలకు పూర్వవైభవం కల్పించే దిశగా సంబంధిత అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలన్నిటినీ తిరిగి ఉపయోగంలోకి తేవాలన్న ఆదేశాల మేరకు ఐడీసీ అధికారులు సంయుక్తంగా రూ.120 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి అందించారు. జిల్లాలో మొత్తం 42 ఎత్తిపోతల పథకాలను నిర్మించగా.. ప్రస్తుతం రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా 40 పథకాలు వృథాగా మారిపోయాయి. 

గత బీఆర్​ఎస్​పదేండ్ల పాలనలో ఎప్పటికప్పుడు రిపేర్లు చేపట్టకపోవడం, నిర్వహణకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడం, ఎత్తిపోతల పథకాల నిర్వహణపై రైతులు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఈ పథకాలన్నీ ఉపయోగంలో లేకుండాపోయాయి.

75 వేల ఎకరాలకు నీరందించేలా..

ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా నిర్మల్​లో 42 ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. వీటి కింద మొదట దాదాపు 50 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కానీ ప్రస్తుతం రెండు మూడు వేల ఎకరాలకు మాత్రమే ఈ పథకాల ద్వారా సాగునీరు అందుతోంది. 

వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పథకాలన్నీ నిరుపయోగంగా మారడంతో వీటిపై కాంగ్రెస్​ ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటన్నిటినీ పునరుద్ధరించి ప్రస్తుతం నిర్ధారించిన 50,000 ఎకరాలకే కాకుండా మరో 25 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.120 కోట్లతో రిపేర్లకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.

ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేస్తే రాబోయే వేసవి చివరి వరకు పనులను పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 42 ఎత్తిపోతల పథకాలకు రిపేర్లు పూర్తయితే నిర్మల్ జిల్లాలో 75 వేల ఎకరాలకు నీరందించే అవకాశం ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు.

నిర్మల్  సెగ్మెంట్​లో..

నిర్మల్ నియోజకవర్గంలోని బన్సపెల్లి, దిలావర్​పూర్, న్యూలోలం ఎత్తిపోతలను కలిపి ఒక ప్యాకేజీ కింద అంచనాలు తయారు చేశారు. మొత్తం రూ.73 కోట్లతో ఈ మూడు పథకాలకు రిపేర్లు చేసేందుకు అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. సమందర్ పల్లి, టింబరేని ఎత్తిపోతల పథకానికి చెరో రూ.5 కోట్లు, కంజర, నరసాపూర్ జి ఎత్తిపోతల పథకం రిపేర్లకు చెరో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి సర్కారుకు అందించారు. ముథోల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎత్తిపోతల పథకం రిపేర్లకు రూ.3 కోట్లు, మన్మధ్​కు రూ.3 కోట్లు, ఆష్టాకు, కౌట ఎత్తిపోతలకు చెరో రూ.3 కోట్లు, పంచగుడి లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్లకు రూ.80 లక్షలతో రిపేర్లకు ప్రతిపాదనలు 
రూపొందించారు.  

వృథాగా మారిన రూ.80 కోట్ల లిఫ్ట్ స్కీం..

జిల్లాలోని బ్రహ్మంగావ్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ.80 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఇప్పటివరకు ఆ పథకం ద్వారా పంట పొలాలకు చుక్కనీరు అందించలేదు.  2013లో ఈ పథకం పనులు ప్రారంభించగా 2018లో పనులు పూర్తయ్యాయి. 

ఈ ఎత్తిపోతల పథకం కింద 6 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు ఏడేండ్ల నుంచి పథకం పనిచేయడం లేదు. పథకం ఊరికి దూరంగా ఉండడంతో యంత్రాలు, పరికరాలు, ట్రాన్స్ ఫార్మర్లను దొంగలు ఎత్తుకెళ్లినప్పటికీ పట్టించుకునే వారే లేరు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ ఈ పథకాన్ని కార్యరూపంలోకి తీసుకు రావాలని తలపెట్టింది. రిపేర్లకు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు త యారు చేశారు.