- సందర్శకులతో కిటకిటలాడిన ఎన్టీఆర్ మినీ స్టేడియం
నిర్మల్, వెలుగు : నిర్మల్ ఉత్సవాల పేరిట మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న నుమాయిష్వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి కలెక్టర్ అభిలాష అభినవ్, అడిషనల్ కలెక్టర్లు కిశోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్ హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను, గేమింగ్ జోన్ ను పరిశీలించారు.
విద్యార్థులు, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, మహిళా స్వయం సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలోని వస్తువులను పరిశీలించి అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీ వరకు సాగనున్న కార్యక్రమానికి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆదివారం కావడంతో సందర్శకులతో నుమాయిష్కళకళలాడింది. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకల్యాణి, అధికారులు పాల్గొన్నారు.