నిర్మల్ మాస్టర్ ప్లాన్.. జీవో రద్దు చేయాలి:వివేక్ వెంకటస్వామి

  • జోన్ మార్పుపై ఎన్జీటీకివెళ్లాలి: వివేక్ వెంకటస్వామి
  • బీఆర్ఎస్​ నేతలకు మేలు చేసేలా మార్చారని ఫైర్
  • బీజేపీ నేత మహేశ్వర్​రెడ్డి దీక్షకు మద్దతు

నిర్మల్, వెలుగు: బీఆర్ఎస్ నేతలకు వేల కోట్ల రూపాయల మేలు జరిగేలా రూపొందించిన నిర్మల్ మాస్టర్ ప్లాన్, దానికి సంబంధించిన జీవో నంబర్ 220ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జి.వివేక్ వెంకట స్వామి డిమాండ్ చేశారు. శనివారం ఆయన నిర్మల్​లో కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్​ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. తర్వాత వివేక్ మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ తయారీలో మంత్రి బంధువుల ఒత్తిళ్లు పనిచేశాయన్నారు. వారి కోసమే సోఫీనగర్​లోని ఇండస్ట్రియల్ జోన్​ను గ్రీన్ జోన్ అయిన మంజులాపూర్, తల్వేద పంట భూముల వైపు మళ్లించారని ఆరోపించారు. 

జోన్​ల మార్పు వెనుక కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయన్నారు. మాస్టర్ ప్లాన్​లో గ్రీన్ జోన్ మార్పుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ను ఆశ్రయించాలని సూచించారు. ఎన్జీటీ ద్వారానే మాస్టర్ ప్లాన్​ను అడ్డుకునే అవకాశం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్​కు ధర్నాలు, ప్రజల ఆందోళనలు పట్టడం లేదన్నారు. మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను భగ్నం చేసే కుట్రలు కూడా జరుగుతాయని.. ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆయనకు అండగా ఉండి ఎదిరించాలన్నారు. మహేశ్వర్ రెడ్డి ప్రజలు, రైతుల కోసం పోరాడుతున్నారని ఆయనకు ప్రజలంతా అండగా నిలుస్తుండడం అభినందనీయమన్నారు. 

ప్రజల కోసం మహేశ్వర్ రెడ్డి ఆస్తులు అమ్ముకున్నారని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్​లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ప్రజలంతా చెబుతున్నప్పటికీ మంత్రి, సీఎం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న మహేశ్వర్ రెడ్డికి అండగా నిలిచేందుకే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఆయనకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు అల్జాపూర్ శ్రీనివాస్, అయ్యన్న గారి భూమయ్య, రావుల రామనాథ్, అర్జున్, మల్లికార్జున్ రెడ్డి, సుహాసిని రెడ్డి, మెడి సమ్మరాజు, సాదం అరవింద్‌‌‌‌‌‌‌‌, భూపతి రెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.