డీ వన్ పట్టాల అక్రమాలపై దర్యాప్తు జరపాలి.. నిర్మల్​ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్

డీ వన్ పట్టాల అక్రమాలపై దర్యాప్తు జరపాలి.. నిర్మల్​ఎమ్మెల్యే  మహేశ్వర్  రెడ్డి డిమాండ్

నిర్మల్, వెలుగు: నిర్మల్ నియోజకవర్గంలో డీ వన్  పట్టాల పేరిట జరిగిన భూ అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన తన క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కోట్ల విలువచేసే భూములను నకిలీ డీ వన్ పట్టాల పేరిట అప్పటి అధికార పార్టీ నేతలు, వారి బంధువులు కాజేశారని ఆయన ఆరోపించారు. అక్రమ డీ వన్ పట్టాల ను సృష్టించిన వారు ఎంతటి వారైనా సహించబో మన్నారు. అప్పటి జాయింట్  కలెక్టర్  సహకారంతో బీఆర్ఎస్  పార్టీ నేతలు, వారి బంధువులు డీ వన్  పట్టాల దందాకు తెరలేపారని విమర్శించారు.

ఇప్పటికే ఆ పట్టాల అక్రమాలపై తాను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయానని, జిల్లా కలెక్టర్ కు‌‌, సంబంధిత అధికారులందరికీ ఫిర్యాదు చేశానని తెలిపారు.  డీ వన్ పట్టాల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దిలావార్ పూర్  మండలంలో 180 ఎకరాల ప్రభుత్వ భూములను డీ వన్ పట్టాల పేరిట బీఆర్ఎస్  నేతలు స్వాహా చేశారని పేర్కొన్నారు.  గతంలో కూడా ఆ అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్  నేతలు అన్ని గ్రామాల్లోనూ విలువైన భూములను కబ్జా చేశారని మండిపడ్డారు.

నిర్మల్  పట్టణ స మీపంలోని ఓ గ్రామంలో కూడా అసైన్డ్  భూమిని వారు ఆక్రమించుకున్నారని చెప్పారు. అలాగే పట్టణ సమీపంలోని పలు అసైన్డ్ భూములలో రియల్ ఎస్టేట్ వెంచర్లు చేశారని, ఫంక్షన్ హాల్  లాంటివి నిర్మించారన్నారు. అధికా రులు తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.