కడెం, వెలుగు : సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిర్మల్ఎస్పీ జానకి షర్మిల సూచించారు. కడెం మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన గంగాపూర్, లక్ష్మీపూర్‌లో సోమవారం ఎస్పీ పర్యటించి గిరి ప్రజలకు సైబర్ నేరాలు, మత్తు పదార్థాల పట్ల అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, నేరాలను నియంత్రించేందుకు జాగ్రత్తలు పాటించాలన్నారు.
గుర్తు తెలియని వెబ్ లింకులు, మెసేజ్‌లకు స్పందించి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దన్నారు. గిరిజన గ్రామాల్లో గాంజా, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం కడెం ప్రాజెక్టులో తెలంగాణ టూరిజం ఏర్పాటుచేసిన బోట్లో ఎస్పీ కుటుంబసభ్యులతో కలిసి పర్యటించి ప్రకృతి అందాలను తిలకించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాజేశ్ మీనన్, సీఐ సైదారావు, ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.