వరద నష్టంపై అంచనాలు రూపొందించాలి

వరద నష్టంపై అంచనాలు రూపొందించాలి
  • స్పెషల్ ఆఫీసర్ భవేశ్ మిశ్రా

నిర్మల్,వెలుగు: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రహదారులు, బ్రిడ్జిలు, పంటలకు జరిగిన నష్టంపై అంచనాలు సిద్ధం చేయాలని నిర్మల్​ జిల్లా ప్రత్యేక అధికారి భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలు, రహదారులు, నివాస గృహాలు, శాఖల వారీగా జరిగిన నష్టంపై కలెక్టర్ అభిలాష అభినవ్​తో కలిసి ఆయన ఆదివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై రిపోర్టులు తయారుచేయాలని ఆదేశించారు.

పంటలు నష్ట పోయిన రైతులకు, నివాస గృహాలు కూలిపోయిన బాధితులకు పూర్తి సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇంటిలో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలన్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖలకు సంబంధించి రహదారులు, బ్రిడ్జిలకు జరిగిన నష్టాన్ని పక్కాగా నమోదు చేసి రిపోర్టులు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డీఆర్ఓ భుజంగరావు, ఆర్డీవోలు రత్న కల్యాణి, కోమల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.