టెన్త్​లో నిర్మల్ ​టాప్..రెండోసారి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

  • కలెక్టరేట్ లో సంబురాలు
  • 31వ స్థానానికి పడిపోయిన ఆసిఫాబాద్
  • ఆదిలాబాద్​కు 17, మంచిర్యాలకు 20వ ర్యాంక్

నిర్మల్, వెలుగు : టెన్త్​ ఎగ్జామ్స్​ఫలితాల్లో 99.5 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ స్టేట్ ఫస్ట్​గా నిలిచింది. 2023 లోనూ ఫస్ట్ నిలిచిన జిల్లా ఆ స్థానాన్ని కాపాడుకుంది. జిల్లాలో మొత్తం 8908 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8823 మంది పాసయ్యారు. వీరిలో 4226 మంది బాయ్స్, 4577 మంది గర్ల్స్ ఉన్నారు. బాలురు 98.74 శాతం‌, బాలికలు 99.33 ఉత్తీర్ణత సాధించారు.

333 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. 154 స్కూల్స్ 100 శాతం రిజల్ట్ సాధించాయి. మొత్తం 166 ప్రభుత్వ పాఠశాలలకు గానూ 165 పాఠశాలలకు చెందిన 6,037 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5,964 మంది పాసయ్యారు. మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ 98.79 శాతం ఉత్తీర్ణత సాధించాయి.

పక్కా ప్రణాళికతో..

గతేడాది రికార్డును నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో డీఈఓ రవీందర్ రెడ్డి ఎస్సెఎస్సీ పరీక్షల కోసం పకడ్బందీగా ప్రణాళిక రూపొందించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తోడ్పాటుతో పరీక్షలకు  45 రోజులు ముందు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఓవైపు హాజరు శాతం పెంచుతూనే డిసెంబర్ నాటికే మొత్తం సిలబస్ పూర్తయ్యేట్లు చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి సబ్జెక్టుల వారీగా ఏరోజు చదివిన అంశాలపై ఆరోజు స్లిప్ టెస్టులు నిర్వహించారు. ఇలా పకడ్బందీ యాక్షన్ ప్లాన్​తో నిర్మల్ మరోసారి స్టేట్ ఫస్ట్​గా నిలిచింది.

కలెక్టరేట్​లో సంబురాలు

ఎస్ఎస్సీ ఫలితాల్లో జిల్లా మరోసారి స్టేట్ ఫస్ట్ సాధించడంతో కలెక్టరేట్ ఆవరణలో సంబురాలు చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డీఈఓ రవీందర్ రెడ్డితోపాటు విద్యాశాఖ అధికారులు, వివిధ టీచర్ సంఘాల ప్రతినిధులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. కలెక్టర్ కేకు కట్ చేసి డీఈఓకు తినిపించారు. అనంతరం ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాను మొదటి వరుసలో నిలపడంలో కృషి చేసిన టీచర్లకు, కష్టపడి ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు జిల్లా విద్యారంగానికి గర్వకారణమన్నారు.

ఆసిఫాబాద్​కు 31వ ర్యాంకు

ఆసిఫాబాద్ జిల్లా 83.29 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 31వ స్థానానికి పడిపోయింది. గతేడాది 29వ ర్యాంకులో ఉన్న జిల్లా ఈసారి మరింత పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా 6,393 మంది పరీక్షలకు హాజరుకాగా 5,325 మంది ఉత్తీర్ణత సాధించారు. 2 ,366 మంది బాలురు, 2,959 మంది బాలికలు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు 17వ స్థానం దక్కగా, మంచిర్యాల 20వ స్థానంలో నిలిచింది. అన్ని జిల్లాలోనూ బాలికల హవా సాగింది.