నిర్మల్​ను టూరిజం హబ్​గా తీర్చిదిద్దుతాం : రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్​ రమేశ్ రెడ్డి

నిర్మల్​ను టూరిజం హబ్​గా తీర్చిదిద్దుతాం : రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్​ రమేశ్ రెడ్డి
  • చారిత్రక కట్టడాలకు పూర్వవైభవం

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని చారిత్రక, సహజ సిద్ధమైన ప్రదేశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి టూరిజం హబ్​గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. నిర్మల్​లోని బంగల్​పేట చెరువు మధ్యలోని బురుజును, శ్యామ్​గడ్ కోటను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తితో కలిసి ఆదివారం సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో అనేక చారిత్రక కోటలు, బురుజులు ఉన్నా యని.. వీటన్నింటికీ పూర్వ వైభవం కల్పిస్తామన్నారు. బాసర సరస్వతి అమ్మ వారి పుణ్యక్షేత్రం నుంచి కవ్వాల్ అభయారణ్యం వరకు టూరిజం కారిడార్ ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు రూపొందిస్తామని తెలిపారు.

ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టులతోపాటు కుంటాల, పొచ్చెర జలపాతాలను కలిపి ఈ కారిడార్ పరిధిలోకి చేరుస్తామన్నారు. టూరిజం రంగం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, అలాగే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు.