- ఆక్రమణలకు గురవుతున్న గొలుసుకట్టు చెరువులు
- ఏటా నిర్మల్‌కు వరద ముప్పు
- అడ్డగోలుగా వెంచర్లు
- పట్టించుకోని ప్రభుత్వం
నిర్మల్, వెలుగు: చారిత్రక నిర్మల్ పట్టణం ఏటా ముంపు బారిన పడుతోంది. కాకతీయుల కాలంలో ప్రణాళికా బద్ధంగా నిర్మించిన గొలుసుకట్టు చెరువులను, కందకాల అక్రమార్కులు కబ్జా చేయడంతో ప్రతి వానాకాలం నిర్మల్ పట్టణం వరదలో మునుగుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏటా ముంపు సమస్య జనాన్ని వెంటాడుతోంది. పెరిగిన జనాభా, ఇండ్ల నిర్మాణాల కారణంగా ఒకప్పుడు ఊరి బయట ఉన్న గొలుసుకట్టు చెరువులన్నీ ఇప్పుడు ఊరి మధ్యకి వచ్చాయి. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ భూములు, చెరువులకు సంబంధించిన శిఖం, బఫర్ జోన్ భూములపై కబ్జాదారుల కన్ను పడింది. అధికార పార్టీ నేతల అండదండలు, అధికారుల సహకారంతో రికార్డులను సైతం తారుమారు చేసి పలువురు చెరువుల ఆక్రమణకు పాల్పడ్డట్లు ఫిర్యాదులున్నాయి. డీటీసీపీ అనుమతులు లేకుండానే వెంచర్లు ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయి. ఈ ఆక్రమణల కారణంగా ఏటా వానాకాలంలో అనేక కాలనీలు నీట మునుగుతున్నాయి. కంచరోని చెరువు, ధర్మసాగర్, మోతి తలాబ్, మంజులాపూర్, పల్లె చెరువుల భూములను ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆక్రమించేశారు. అక్కడ శాశ్వత నిర్మాణాలు కూడా చేపట్టారు.
కందకాలనూ వదలడంలేదు
నిర్మల్ పట్టణ నడిబొడ్డున ఉన్న భారీ కందకాలతోపాటు నాలాలు సైతం ఎక్కడికక్కడ ఆక్రమణకు గురయ్యాయి. దీంతో వీటి గుండా ప్రవహించాల్సిన నీరంతా సమీప కాలనీల్లోకి తన్నుకొస్తోంది. కొద్దిపాటి వర్షానికే పట్టణంలోని అనేక వార్డులు జలమయం అవుతుండడం సాధారణంగా మారింది. కందకాల కబ్జా కారణంగానే నిర్మల్ లోని డాక్టర్స్ లేన్ ఏటా నీట మునిగిపోతోంది. చెరువులు, కందకాల ఆక్రమణ కారణంగా జీఎన్ఆర్ కాలనీతో పాటు సిద్దాపూర్, ఆదర్శనగర్, శాంతినగర్, ఇంద్రనగర్ శాస్త్రినగర్, వైఎస్సార్ కాలనీ, విశ్వనాథపేట్ తదితర ప్రాంతాలన్నీ వరద నీటిలో చిక్కుకుంటున్నాయి.
అటకెక్కిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రతిపాదన
నిర్మల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తామంటూ పాలకులు ఏండ్ల నుంచి చెబుతూనే ఉన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు కూడా పంపారు. కానీ నిర్మాణం దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించడంలేదు. రూ.60 కోట్లతో రూపొందించిన ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.