నిర్మల్ పేరు వినగానే అందమైన కొయ్య బొమ్మలు గుర్తొస్తాయి. ఆ బొమ్మలే నిర్మల్‌ని టూరిస్ట్ ప్లేస్‌గా మార్చాయి. కొయ్య బొమ్మల పరిశ్రమతోపాటు కడెం ప్రాజెక్ట్, మహబూబ్ ఘాట్స్, కదిలి పాపహరేశ్వరాలయం చూసేందుకు జనాలు నిర్మల్‌కు ‘క్యూ’ కడుతున్నారు.
నిర్మల్ జిల్లాలో కొయ్య బొమ్మలే కాదు... ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఎకో టూరిజానికి బాటలు వేస్తున్నాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో కొయ్యబొమ్మల పరిశ్రమ, కడెం ప్రాజెక్టు, మహబూబ్ ఘాట్స్, కదిలి పాప హరేశ్వరాలయం, చారిత్రక కోటలు టూరిజానికి కేరాఫ్‌గా మారాయి. వాటిని చూసేందుకు నిర్మల్ జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా టూరిస్ట్‌లు వస్తున్నారు.
కొయ్య బొమ్మలు
నిర్మల్ కొయ్య బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందాయి. నిర్మల్‌లో ప్రధాన రహదారి పక్కనే ఉన్న కొయ్య బొమ్మల షోరూమ్‌తో పాటు పొనికి కర్రతో తయారు చేసే బొమ్మలు ఆకట్టుకుంటాయి. బొమ్మల తయారీ, అమ్మకాలు ఒకే చోట ఉండడం వల్ల టూరిస్ట్‌లు ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడుతున్నారు.
మహబూబ్ ఘాట్స్
హైదరాబాద్ నుండి నాగపూర్‌కు వెళ్లే దారిలో దట్టమైన అడవులతో కూడిన సహ్యాద్రి పర్వతాల మధ్యన మహబూబ్ ఘాట్స్ ఉన్నాయి. గతంలో ఏడో నెంబర్ జాతీయ రహదారి పైన ఉన్న ఈ ఘాట్స్ టూరిస్ట్లని అలరించేవి. ఇప్పుడు నిర్మల్ నుండి వాంకిడి వరకు వెళ్లేందుకు బైపాస్ ఏర్పాటు చేసినప్పటికీ టూరిస్ట్‌లు ఈ పాత జాతీయ రహదారి గుండానే ఎక్కువగా వెళ్తుంటారు.
ఒకవైపు లోయలు, మరోవైపు దట్టమైన అడవుల మధ్య ఈ ఘాట్స్ దాటుతుంటే ఆహా ప్రకృతి అందాలు అనాల్సిందే. ఘాట్స్ పైన ఉన్న వ్యూ పాయింట్ నుండి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కనిపిస్తుంది. దీంతోపాటు దట్టమైన అడవులు, సహజ సుందర దృశ్యాలు టూరిస్ట్‌లను మైమరిపిస్తాయి. వర్షాకాలంలో మహబూబ్ ఘాట్స్‌పై నుండి ప్రవహించే సెలయేళ్లు... చిన్నపాటి జలపాతాలను తలపిస్తాయి.
కడెం ప్రాజెక్ట్
దట్టమైన కవ్వాల్ అభయారణ్యం మధ్యలో ఉన్న కడెం ప్రాజెక్ట్... నిర్మల్ జిల్లాలోనే అతి పురాతనమైన ప్రాజెక్ట్. ఓవైపు పంట పొలాలకు సాగు నీరు అందిస్తూ మరోవైపు టూరిస్ట్ ప్లేస్‌గా నిలుస్తోంది. ప్రతి రోజు కడెం ప్రాజెక్ట్‌ను చూసేందుకు దూర ప్రాంతాల నుండి వస్తుంటారు. సెలవు రోజుల్లో, ఆదివారాలు టూరిస్ట్‌లు ఎక్కువ సంఖ్యలో వస్తారు. టూరిజం శాఖ హరిత రిసార్ట్ కట్టింది. ఇందులో వసతి సౌకర్యం కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన టూరిస్ట్‌లు రిజర్వాయర్‌లో బోటింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతారు. నిర్మల్‌కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడెం ప్రాజెక్ట్ చూసిన టూరిస్ట్‌లు జన్నారంలోని కవ్వాల్ అభయారణ్యం ఎకో టూరిజం చూసేందుకు వెళ్తారు.
కదిలి పాప హరేశ్వరాలయం
నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలం కదిలి పాప హరేశ్వరాలయాన్ని చూసేందుకు ఆధ్యాత్మిక ప్రకృతి ఆరాధకులు ఎక్కువగా వస్తుంటారు. దట్టమైన అడవుల మధ్య లోయలో ఉన్న ఈ ఆలయాన్ని కాకతీయ రాజులు కట్టించారు. ప్రకృతి ఒడిలో కొలువైన ఈ ఆలయ శిల్పకళ భక్తులనే కాకుండా సాధారణ టూరిస్ట్‌లను కూడా ఆకట్టుకుంటుంది. ఇక్కడ అన్నపూర్ణ మాతా ఆలయంతో పాటు సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు, నీటి గుండం ప్రవాహం ఆలయ మహత్యానికి నిదర్శనంగా చెప్తారు భక్తులు. మండుటెండల్లో కూడా ఇక్కడి కాలువ, కోనేరుల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వస్తుంటారు.
చారిత్రక కోటలు
నిర్మల్‌లోని చారిత్రక కోటలు కూడా ఎకో టూరిజానికి కేరాఫ్‌గా నిలుస్తాయి. కళాకారుల శిల్ప నైపుణ్యానికి ఈ కట్టడాలు అద్దం పడతాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న శ్యామ్ఘఢ్ కోట విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఈ కోటను కొద్ది రోజుల క్రితం టూరిజం శాఖ కొంత డెవలప్ చేసింది. ఇక్కడ చిన్నపాటి రిసార్ట్ కూడా ఉంది.
కోట చుట్టూ విద్యుత్ దీపాలు ఉండడంతో రాత్రి వేళల్లో అద్భుతంగా కనిపిస్తుంది. దీంతోపాటు చారిత్రకమైన బత్తీస్ ఘడ్ కోట కూడా చూడొచ్చు. ఈ కోటలతోపాటు సోన్ గోదావరిపై ఉన్న పాత బ్రిడ్జి కూడా అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని చాటి చెప్తోంది. హైదరాబాద్ నుండి నాగ్‌పూర్ వెళ్లేవాళ్లు కొద్దిసేపు ఈ బ్రిడ్జిపై రెస్ట్ తీసుకుంటుంటారు. గతంలో టూరిజం శాఖ దీన్ని డెవలప్ చేసి టూరిస్ట్ స్పాట్‌గా మార్చాలి అనుకుంది. కానీ.. ఆ పనులు నిలిచిపోయాయి.
జడల మనోజ్‌కుమార్, నిర్మల్