డిపాజిట్లు పెంచాలె... పీఎస్​బీలకు మంత్రి నిర్మల సూచన

డిపాజిట్లు పెంచాలె... పీఎస్​బీలకు మంత్రి నిర్మల సూచన
  • స్పెషల్​ డ్రైవ్​లు నిర్వహించాలి
  • కోర్ బ్యాంకింగ్​పై దృష్టి సారించాలి

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్​లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డిపాజిట్ వృద్ధిని మెరుగుపరచాలని కోరారు. ఇందుకోసం కస్టమర్లతో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని, స్పెషల్​డ్రైవ్​లు ఏర్పాటు చేయాలని సూచించారు.  గత కొన్ని నెలలుగా క్రెడిట్ వృద్ధి కంటే డిపాజిట్లు 300-–400 బేసిస్ పాయింట్లు తక్కువగా పెరుగుతుండటంతో ఈమె ఈ సూచన చేశారు.

ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా బ్యాంకుల ఆర్థిక పనితీరును సమీక్షించడంతోపాటు పీఎం ఆవాస్ యోజన, పీఎం సూర్య ఘర్, పీఎం విశ్వకర్మ యోజనతో సహా ప్రభుత్వం  వివిధ ప్రధాన పథకాల అమలులో సాధించిన పురోగతిని సమీక్షించారు.  డిపాజిట్ వృద్ధి, క్రెడిట్- టు- డిపాజిట్ నిష్పత్తి (సీడీ నిష్పత్తి),  ఆస్తుల నాణ్యతను కూడా పరిశీలించారు.   కోర్ బ్యాంకింగ్ వ్యాపారంపై దృష్టి సారించాలని, వినూత్న ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా డిపాజిట్ వృద్ధి వేగాన్ని పెంచాలని బ్యాంకుల చీఫ్‌‌‌‌‌‌‌‌లను మంత్రి కోరారు.

డిపాజిట్,  రుణ వృద్ధి మధ్య అసమతుల్యత ఉందని ఇటీవల మంత్రి అన్నారు.    వడ్డీ రేటు విషయంలో ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ బ్యాంకులకు స్వేచ్ఛను ఇచ్చిందని, ఆ స్వేచ్ఛను ఉపయోగించి బ్యాంకులు డిపాజిట్లను మరింత పెంచుకోవాలని ఆమె అన్నారు. ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇదే తరహాలో మాట్లాడారు. బ్యాంకులు తమ విస్తారమైన బ్రాంచ్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించుకోవడం ద్వారా వినూత్న ఉత్పత్తులతో,  సేవలతో డిపాజిట్లను సమీకరించాలని కోరారు.  "పెరుగుతున్న క్రెడిట్ డిమాండ్‌‌‌‌‌‌‌‌ను తీర్చడానికి బ్యాంకులు స్వల్పకాలిక నాన్-–రిటైల్ డిపాజిట్లు,  ఇతర ఇన్​స్ట్రమెంట్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి. దీనివల్ల లిక్విడిటీ సమస్యలు రావొచ్చు”అని అన్నారు. 

సైబర్​ సెక్యూరిటీ గురించి కూడా..

ఈ సమావేశంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఆందోళనలు, ఆర్థిక రంగానికి ఎదురయ్యే నష్టాలపై కూడా చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  మోసం,  ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించిన సమస్యలు,  నేషనల్ అసెట్ రీకన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్​ఏఆర్​సీఎల్​) పురోగతి గురించి కూడా సమాలోచనలు జరిగాయి.  నిర్మల 2024–-25 బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టిన తర్వాత బ్యాంకులతో ఇదే మొదటి సమీక్ష సమావేశం.

పనితీరు విషయంలో, మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పీఎస్​యూ బ్యాంకుల నికర లాభం రూ. 1.4 లక్షల కోట్లను దాటింది. రూ. లక్ష కోట్ల అధిక బేస్‌‌‌‌‌‌‌‌ వల్ల గత ఏడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. మనదేశంలోని  12 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్​బీ) కలిసి 2022-–23లో రూ. 1,04,649 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి.  2024 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన రూ. 141,203 కోట్ల మొత్తం లాభంలో, మార్కెట్ లీడర్ స్టేట్ ఎస్​బీఐ వాటా 40 శాతానికి పైగా ఉంది.   ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ గత ఆర్థిక సంవత్సరం (రూ. 50,232 కోట్లు) కంటే 22 శాతం అధికంగా రూ.61,077 కోట్ల లాభాన్ని ఆర్జించింది.