బడ్జెట్ ఎలా ఉండాలంటే..

నిర్మలమ్మకు సామాన్యుడి విన్నపాలు
అంతా ‘డిజిటలే’…‘క్యాష్ కష్టాలు’ తొలగించాలి
ట్యాక్స్ ఎగ్జంప్షన్ 7 లక్షలకు పెంచాలె
వ్యవసాయం లాభసాటిగా మార్చాలి
పెట్రోల్పై ఇన్డైరెక్ట్ ట్యాక్స్తగ్గించాలె
బంగారం బాగా పిరమైంది.. జర చూడుర్రి
హౌసింగ్ లోన్ సబ్సిడీ, సేవింగ్ డిడక్షన్స్ పెంచాలె

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి సామాన్యులు చాలా విన్నపాలు చేసుకున్నారు. శనివారం ప్రవేశపెట్టే సెంట్రల్ బడ్జెట్పై జనాలు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఖర్చులకు, రాబడికి మధ్య గ్యాప్ చాలా ఎక్కువైందన్నది అందరి మాట. కనీసం కాసు బంగారమైనా లేదే అని బాధపడే రోజులు పోయాయి. ఇప్పుడు బంగారం అనే మాట ఎత్తడానికే భయపడుతున్నారు. పెళ్లిళ్లు వగైరా ముఖ్యమైన శుభకార్యాలకు తప్పితే బంగారం ఊసు ఎత్తడం లేదని చెబుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ దెబ్బకు చిల్లర దుకాణాలు బావురుమంటున్నాయి. క్యాష్ రొటేషన్ కాక తిప్పలు పడుతున్నారు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలని, పెట్రోల్, నిత్యవసరాల ధరలు తగ్గించాలని మిడిల్ క్లాస్వాళ్లు కోరుకుంటున్నారు.

 

ఖర్చు డబులైంది
మా కుటుంబంలో నలుగురం ఉంటాం. గతేడాది నెలవారీ సరుకులకు రూ.3 వేలయితే, ఇప్పుడు రూ.6 వేలవుతోంది. నాలుగైదు నెలలుగా ఉల్లిగడ్డలు కొనలేకపోతున్నాం. ఎల్లిగడ్డ రేటు ఈ ఏడాదిలో రెట్టింపయ్యింది. కిలో ఎల్లిగడ్డ రూ.200లకు అమ్ముతున్నారు. బియ్యం, గోధుమ పిండి, నూనె, పప్పులు, అల్లం, పల్లీలు, పండ్లు, కూరగాయలు అన్నింటి రేట్లు పెరిగాయి. రాబడి మాత్రం పెరగలేదు.
– పుష్పలత, గృహిణి, మధురానగర్

పైసలకు తక్లీబవుతాంది
యాడాది నుంచి ఊళ్లె పైసలకు తక్లీబ్ అయితాంది. పెద్ద నోట్లను మార్చిన సంది ఈ గోస ఎక్కువున్నది. ఊళ్లే దొరికే సామాన్లను ఎక్కువ మంది కొంటలేరు. మా దగ్గరున్న టౌన్కు పోయి సామాన్లు తెచ్చుకుంటున్నరు. ఎందుకని అడిగినా. ‘ నీకు తెల్వందేముంది నాగన్నా… అక్కన్నయితే కార్డు ఇస్తే గీకుతడు. పనై పోతది. ఊళ్లె పైసలు కూడా దొరుకుత లేవు. ఇట్లయితే పల్లెలు ఏం గావాలె.
– కె. నాగన్న, కిరాణా షాపు, వరంగల్ అర్బన్

 

ట్యాక్స్ ఎగ్జంప్షన్ పెంచాలె
ఉద్యోగులకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ను రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ట్యాక్సెస్ రేషనలైజేషన్ కాలేదు. స్టాండర్డైజేషన్ పెంచలేదు. దీంతో మొత్తం రిలీఫ్ దొరకడం లేదు. ఎంప్లాయీస్ నేరుగా ట్యాక్స్ కట్టాల్సి వస్తోంది. ఏం కొన్నా దానిమీద జీఎస్టీ కడుతున్నాం. ట్యాక్స్ ఎగ్జంప్షన్ను కనీసం రూ.7 లక్షలకు పెంచాలి.
– హరిప్రసాద్, రిటైర్డ్ బ్యాంక్ అధికారి, హైదరాబాద్

 

క్యాష్ రొటేషన్ తగ్గింది
రెండు, మూడు రూపాయలకు కూడా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం చేస్తామంటున్నరు. చిల్లరకు కష్టమైతే లేదు కానీ, క్యాష్ రొటేషన్ అయిత లేదు. రోజుకు వెయ్యి రూపాయలు గిరాకీ అయితే… అండ్ల సగం డిజిటల్ పేమెంట్సే ఉంటున్నయ్. మాకు పెద్దగా లాభమైతే ఉంటలేదు.
– సంజీవ్, కిరాణ షాపు యజమాని,
మధురానగర్, హైదరాబాద్

 

రైతును బాగు చేయాలె
వ్యవసాయ పెట్టుబడి పెరిగి రైతుకు గిట్టుబాటు అయిత లేదు. ఎకరం వరినాటుకు రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీన్నుంచి రైతులను బయట పడేయ్యాలె. వ్యవసాయం చేస్తే లాభాలొస్తయ్ అన్నట్టు చేయాలె. దీనికోసం ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్న పనులు సరిపోవు. ఫాం మెకనైజేషన్ను ఎంకరేజ్ చేస్తే బాగుంటది.
– వర్ధెల్లి అన్నారావు, ప్రోగ్రెస్సివ్ ఫార్మర్, దండేపల్లి

 

ఇల్లు కొనడమంటే పగటి కలే
ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంతిల్లు కొనుక్కునే అవకాశం కనిపిస్త లేదు. ఇల్లు, ఫ్లాట్ కొనుక్కునే ఎంప్లాయీస్కు ఇచ్చే హౌసింగ్ లోన్ సబ్సిడీ పర్సంటేజ్ పెంచాలె. ఇప్పుడు ఉన్న పరిమితి రూల్స్ఎత్తేయాలి. సేవింగ్ డిడక్షన్స్ పెంచి… ఉద్యోగులు కట్టే ట్యాక్స్ నుంచి కొంచెమైనా మినహాయింపు ఇవ్వాలె.
– రమేశ్, ప్రైవేట్ ఉద్యోగి, సుచిత్ర సర్కిల్, హైదరాబాద్