ఖర్చులేని సాగుసాధ్యమా?

ఖర్చులేని  సాగుసాధ్యమా?

మోడీ సర్కారు తాజా బడ్జెట్​లో వ్యవసాయరంగానికి గతేడాది కన్నా భారీగా నిధులు కేటాయించింది. రానున్న మూడేళ్లలో (2022 నాటికి) రైతుల ఆదాయాన్ని కూడా డబుల్ చేయాలని టార్గెట్​ పెట్టుకుంది. దీనికోసం ‘జీరో బడ్జెట్​ ఫార్మింగ్​’ అనే కాన్సెప్ట్​ని తెరపైకి తెచ్చింది. ఈ కొత్త మోడల్..​ పంట దిగుబడులను, రైతాంగం  రాబడి పెంచటంలో ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.  జీరో బడ్జెట్​ వ్యవసాయానికి ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం తీస్తున్నారు. ఎవరెలా అనుకున్నా సంప్రదాయ పద్ధతుల్లో పండించటమనే అర్థమే వస్తుంది. అంటే కెమికల్‌ ఫెర్టిలైజర్‌ అండ్‌ పెస్టిసైడ్ల వినియోగాన్ని తగ్గించటమన్న మాట.  మరో విధంగా చెప్పాలంటే ‘పాత పద్ధతులకు మారడం’.

నరేంద్ర మోడీ సర్కారు సెకండ్‌ ఫేజ్‌లో వ్యవసాయాన్ని పండుగలా మార్చాలనే అజెండాని ఫిక్స్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం ‘జీరో బడ్జెట్​–నేచురల్​ ఫార్మింగ్’ అనే అంశాన్ని ‘ఎకనమిక్​ సర్వే 2018–19’లో ప్రస్తావించింది. ఈ ప్రోగ్రామ్​ని ఇప్పటికే 972 గ్రామాల్లో అమలు చేస్తున్నారు.  ఈ ప్రయోగాత్మక కార్యక్రమంపై మీడియాలోనూ, సెమినార్లలోనూ చర్చ మొదలైంది. ఈ ఇన్నోవేటివ్​ మోడల్‌పై  మరిన్ని వివరాలను గవర్నమెంట్ వెల్లడించాల్సి ఉంది.

జీరో బడ్జెటా? (లేక) జీరో ఖర్చులా?​
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తన తొలి బడ్జెట్​ ప్రసంగంలో చెప్పిన జీరో బడ్జెట్​ వ్యవసాయానికి ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం తీస్తున్నారు. ప్రకృతి వ్యవసాయమని కొందరు, పెట్టుబడి లేకుండా సాగు చేయటమని మరికొందరు, తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి సాధించటమని ఇంకొందరు భావిస్తున్నారు. ఎవరెలా అనుకున్నా జీరో బడ్జెట్​ వ్యవసాయానికి సంప్రదాయ పద్ధతుల్లో పంటలు పండించటమనే అర్థమే వస్తుంది. అంటే కెమికల్‌ ఫెర్టిలైజర్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌ వినియోగాన్ని తగ్గించటమన్న మాట.

నేచురల్‌ ఫార్మింగ్‌తో పంట పొలాలు సారవంతమవుతాయని దాదాపుగా అందరూ ఒప్పుకునే మాట. దీనిద్వారా  దిగుబడులను, రైతుల ఆదాయాన్ని పెంచాలని మోడీ సర్కారు ఆశిస్తోంది. పర్యావరణంపై పెద్దగా ఎఫెక్ట్​ పడదని భావిస్తున్నారు. జీరో బడ్జెట్​–నేచురల్​ ఫార్మింగ్ (జెడ్​బీ–ఎన్​ఎఫ్​)​ గురించి బడ్జెట్​ డాక్యుమెంట్​లో వివరంగా రాయలేదు. కానీ ఎకనమిక్​ సర్వేలో మాత్రం ఉంది. ‘జెడ్​బీ–ఎన్​ఎఫ్​ అంటే విత్తనాలు, ఎరువులు తదితర ఇన్‌పుట్స్‌ కోసం రుణాలు లేదా నగదు అవసరం లేకుండా చేసే వ్యవసాయం’ అని తెలిపారు.

‘రెట్టింపు ఆదాయం’  వచ్చేదెట్లా?
రైతుల ఆదాయాన్ని 2022 నాటికి డబుల్​ చేయాలనే లక్ష్యంతో మోడీ సర్కారు ఈ ‘జెడ్​బీ–ఎన్​ఎఫ్​’కు శ్రీకారం చుట్టింది. వ్యవసాయాదాయం రెట్టింపు కావాలంటే మోడ్రన్​ అగ్రికల్చర్ మొదలుపెట్టాలి. దీనికి కొత్త టెక్నాలజీలు కావాలి. అభివృద్ధి చేసిన విత్తనాలను​, ఎరువులను, యంత్రాలను, పురుగు మందులను రైతులకు అందించాలి. పంట ఉత్పత్తులు పాడవకుండా నిల్వ చేసే ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. ఇవన్నీ ఉచితంగా అందుబాటులోకి రావటం దాదాపు అసాధ్యమే.

ఐదెకరాల లోపు భూమిగల  సన్న, చిన్నకారు రైతులకు ఏటా పెట్టుబడి సాయం రూ.6000 మూడు విడతల్లో (ఒక్కో దఫా రూ.2000 చొప్పున) ఇవ్వాలని కేంద్రం పోయినేడాది నిర్ణయించింది. ఇప్పటికే రెండు కిస్తీలు ఇచ్చింది. దీనికోసం రూ.75,000 కోట్లతో ‘ప్రధాన్​మంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి (పీఎం–కిసాన్​)’ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ‘అయిదెకరాల లోపు’ అనే రూల్​ ఎత్తేసి రైతులందరికీ డబ్బులు ఇస్తామని ప్రకటించింది. దీంతో ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది.  అయితే ఈ స్కీంకి నిధులు పెరగలేదు. తాజా బడ్జెట్​లోనూ రూ.75,000 కోట్లే కేటాయించారు.

సరైన డేటా లేదే!
ప్రభుత్వ విధానాలను పక్కాగా అమలుచేయాలంటే డేటా కూడా అంతే పక్కాగా ఉండాలని ఎకనమిక్​ సర్వే చెప్పింది. కానీ వ్యవసాయ రంగానికి సంబంధించిన తాజా సమాచారమేదీ సెంట్రల్​ గవర్నమెంట్​ వద్ద లేదు. నేషనల్​ శాంపిల్​ సర్వే ఆఫీసు (ఎన్​ఎస్​ఎస్​ఓ) ఆరేళ్ల కిందట (2012–13లో) సేకరించిన సమాచారమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ప్రభుత్వ పథకాలకు ఈ డేటానే ఆధారం.  ఈ నేపథ్యంలో దేశంలో రైతు కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? సాగు విస్తీర్ణం ఎంత? ఏయే పంటలు ఎన్ని ఎకరాల్లో పండుతున్నాయి? సన్న, చిన్నకారు రైతులు, పెద్ద రైతులు ఎంత మంది? ప్రభుత్వ పెట్టుబడి సాయం ఎంత మందికి అవసరం? దీనికి ఎంత బడ్జెట్​ కేటాయించాలి? అనే వివరాలు కావాలంటే గవర్నమెంట్​ తాజాగా సర్వే చేయించటం బెటర్​. దేశంలో వ్యవసాయ రంగం స్థితిగతులను సమగ్రంగా తెలుసుకోవటం ఎంతైనా అవసరం.

దున్నకుండా వేస్తే కొయ్యకుండా పండిందట!
జీరో బడ్జెట్​ అనగానే జీరో ఖర్చులనే భావనే కలుగుతుంది. వ్యవసాయంలోనే కాదు. ప్రొడక్షన్​ ప్రక్రియ ఏదైనా ఇన్‌‌పుట్స్‌‌ కోసం కొద్దోగొప్పో పెట్టుబడి పెట్టాల్సిందే. సింపుల్​ మైక్రోఎకనమిక్​ థియరీ కూడా ఇదే చెబుతోంది. ఇన్‌‌పుట్‌‌ జీరో అయితే అవుట్​పుట్​ కూడా జీరోనే అవుతుందని ఆ సిద్ధాంతం అంటోంది. దీన్నే పల్లెటూరోళ్లు ‘దున్నకుండా వేస్తే కొయ్యకుండా పండింది’ అంటూ చమత్కరిస్తూ ఉంటారు. పంటలు పండించటానికి ముఖ్యంగా కావాల్సింది నీళ్లు. నీటి చుక్క లేనిదే విత్తనం మొలకెత్తదు. విత్తనం నాటాలంటే ముందు నేలను దున్నాలి. అందరికీ ఎడ్లు, దున్నలు ఉండవు. ట్రాక్టర్​తోనో లేక కిరాయి అరకతోనో దున్నించటానికి ఎంతో కొంత డబ్బు ఖర్చవుతుంది. వర్షాలు కురిస్తే చేలకు, పొలాలకు నీళ్లు ఫ్రీగానే వస్తాయి. దుక్కి ఊరికెనే రాదు.  రూపాయి ఖర్చు లేకుండా వ్యవసాయం చేయటం సాధ్యం కాని పని. రైతులకు ఇది తెలియంది కాదు. రూపాయి ఖర్చు పెట్టి రూపాయిన్నరో, రెండు రూపాయలో సంపాదించాలనుకుంటారు. మరి, పైసా ఖర్చు లేకుండా పండిస్తే ఫలితం ఎలా ఉంటుందోనని అగ్రికల్చరల్‌‌ ఎక్స్‌‌పర్ట్‌‌లు సందేహిస్తున్నారు.

2017–18 వరకు ఉన్న పరిస్థితి
పీరియాడిక్​ లేబర్​ ఫోర్స్​ సర్వే (పీఎల్​ఎఫ్​ఎస్​) ప్రకారం 2017–18 నాటికి దేశంలో 38 శాతం కుటుంబాలు అగ్రికల్చర్​పైనే ఆధారపడ్డాయి. దాన్నొక సెల్ఫ్​ ఎంప్లాయ్​మెంట్​గా చేసుకొని బతుకుతున్నాయి. మరో 12.1 శాతం ఫ్యామిలీలు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నాయి. మొత్తం మీద దాదాపు సగం మంది జనాభాకు అగ్రికల్చరే జీవనాధారం. గత పదేళ్లలో తిండి గింజల ఉత్పత్తి 33.4 శాతం పెరిగినా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు. ఇంత కన్‌‌ఫ్యూజన్‌‌ మధ్య రైతులకు రెట్టింపు ఆదాయం ఎలా సాధ్యమన్న ప్రశ్న తలెత్తుతోంది.