పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. తన సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంతో ఈ రికార్డును నమోదు చేశారు. గతంలో ఆమె పార్లమెంట్‌లో 2 గంటల 17 నిమిషాలు బడ్జెట్ చదివి వినిపించి రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ రికార్డును ఆమె బద్దలుకొట్టారు. బడ్జెట్ 2020లో ఆమె 2 గంటల 30 నిమిషాల పాటు సుదీర్ఘంగా బడ్జెట్ చదివి వినిపించి.. అంతకుముందున్న రికార్డును బద్దలుకొట్టారు. ఆ సమయానికి ఇంకా రెండు పేజీలు మిగిలి ఉండగానే ఆమె అస్వస్థతకు గురికావడంతో బడ్జెట్ ప్రసంగం నిలిపేశారు. అయితే గతంలో ఏ ఆర్థిక మంత్రి కూడా ఇంతటి సుదీర్ఘంగా బడ్జెట్ ప్రసంగం చేయలేదు.
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2020-2021 సంవత్సర కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. రేపు ఆదివారం కావడంతో పార్లమెంట్ సోమవారానికి వాయిదా పడింది. ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్‌కు ఇది రెండవసారి. ఇది సామాన్యుల బడ్జెట్‌గా ఆమె అభివర్ణించారు.