న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వరుసగా ఎనిమిదో సారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. 2019లో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆమె ఒక తాత్కాలిక, 7 పూర్తిస్థాయి బడ్జెట్‌లు సమర్పించారు. ఇప్పటి వరకు ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని మొరార్జీదేశాయ్ సొంతం.
ఆయన వేర్వేరే సమయాల్లో10 బడ్జెట్‌లను ప్రవేశపట్టారు. నిర్మల కూడా ఈ సంఖ్యకు చేరువలో ఉన్నారు. వేర్వేరు సమయాల్లో మాజీ ఆర్థికమంత్రి చిదంబరం 9 బడ్జెట్‌లను ప్రవేశపట్టారు. ఆయన తర్వాత 8 బడ్జెట్లతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉండగా.. ఆయనను సీతారామన్ ఇప్పుడు సమం చేశారు.
ఏకైక మహిళా నాయకురాలు
2019లో మోదీ సారథ్యంలో రెండో దఫా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిర్మల మొద టి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. 2019-–20 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-–24 వరకు వరసగా ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లను, నిరుడు సార్వత్రిక ఎన్నికలతో తాత్కాలిక బడ్జెట్‌ను సమర్పించారు.
ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల అనంతరం 2024–-25కి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించారు. ఇప్పుడు ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పారు. అలాగే, 2020 ఫిబ్రవరి 1న 2 గంటల 40 నిమిషాల పాటు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంతో రికార్డు సృష్టించారు.