- ఒక గంట 15 నిమిషాల పాటు ప్రసంగం
- ‘వికసిత్ భారత్’ తమ లక్ష్యమని ప్రకటన
న్యూఢిల్లీ: తెలుగు కవి గురజాడ అప్పారావు కవితతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆమె స్పీచ్ ప్రారంభించి.. మధ్యాహ్నం 12.15 గంటలకు ముగించారు. దాదాపు ఒక గంట 15 నిమిషాలపాటు ప్రసంగం కొనసాగింది. మహా కుంభమేళా తొక్కిసలాటపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనల నడుమే నిర్మలమ్మ 2025–26 బడ్జెట్ స్పీచ్ స్టార్ట్ చేశారు.
వికసిత్ భారత్ దిశగా..
ప్రపంచ వ్యాప్తంగా జియో పొలిటికల్ సమ స్యలు ఉన్నప్పటికీ ‘వికసిత్ భారత్’ దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలో తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు చెప్పినట్లు ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయి’ అనే స్ఫూర్తితో ‘వికసిత్ భారత్’ దిశగా సాగుతున్నాం. పేదరికాన్ని నిర్మూలించడం, పిల్లలకు 100% మెరుగైన విద్య అందించడం, హై క్వాలిటీ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడం మా ముందున్న లక్ష్యాలు. పది అంశాలతో ఈ బడ్జెట్‌ను తీసుకువస్తున్నాం. పేదలు, యువత, రైతులు, మహిళల సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తున్నాం” అని వివరించారు.
నాలుగు ఇంజిన్స్
బడ్జెట్ థీమ్ నాలుగు ఇంజిన్స్ చుట్టూ రూపొందించామని ఆర్థిక మంత్రి తెలిపారు. వ్యవసాయం తమ మొదటి ఇంజిన్ అని, ఎంఎస్ఎంఈ తమ రెండో ఇంజిన్ అని, ఇన్వెస్ట్మెంట్స్ మూడో ఇంజిన్ అని, ఎక్స్‌పోర్ట్స్ నాలుగో ఇంజిన్ అని వివరించారు. ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ‘‘ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన” కింద 100 అగ్రి జిల్లాలను అభివృద్ధి చేస్తామని.. రైతులకు కిషన్ క్రెడిట్ కార్డ్స్ కింద ఇప్పటి వరకు ఉన్న రూ. 3 లక్షల రుణాన్ని రూ. 5లక్షలకు పెంచుతామని చెప్పారు. బిహార్‌లో ‘మఖానబోర్డు’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంఎస్ఎంఈలకు రుణాలను రూ. 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
విద్యార్థుల కోసం ‘భారతీయ భాష పుస్తక్’ స్కీమ్‌ను తీసుకువస్తున్నామని.. దీని ద్వారా అన్ని పాఠ్యపుస్తకాలు భారతీయ భాషల్లో డిజిటల్రూపంలో వస్తాయని తెలిపారు. విద్యారంగంలో ఏఐని జోడిస్తున్నామని వివరించారు. రూ. 12 లక్షల లోపు ఆదాయం కలిగినవాళ్లు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని.. ఇది మిడిల్ క్లాస్ ప్రజల జీవితాల్లో అనూహ్య మార్పు తీసుకువస్తుందని పేర్కొన్నారు. గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు ఇస్తామని, ఆరోగ్య బీమా కల్పిస్తామని నిర్మల తన బడ్జెట్ స్పీచ్‌లో ప్రకటించారు.
‘‘జీవులన్నీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నట్లే.. దేశంలోని పౌరులు సుపరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు” అనే తిరుక్కురల్‌లోని 542వ శ్లోకాన్ని నిర్మలమ్మ చదివి వినిపించారు. ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు మంచి పాలనను అందించేందుకు సంస్కరణలే మంచి మార్గమని.. వికసిత్ భారత్ దిశగా మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామని తెలిపారు.
బిహార్ దులారీ దేవి ఇచ్చిన గిఫ్ట్ చీరలో..!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీర ఎప్పటిలాగే ఈసారి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతిసారి బడ్జెట్సమయంలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పే చీరలో ఆమె కనిపిస్తుంటారు. శనివారం ఆఫ్ వైట్ కలర్ చేనేత సిల్క్ చీరను నిర్మలమ్మ ధరించారు. చేప కళాకృతులు చీరపై ముద్రించి ఉన్నాయి. అయితే.. ఈ చీరకు ఓ ప్రత్యేకత ఉంది. బిహార్‌కు చెందిన మధుబని కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి స్వయంగా రూపొందించి దీన్ని ఇటీవల నిర్మలా సీతారామన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. బడ్జెట్ సమయంలో ధరించాలని ఆమె కోరారు. మధుబని ఆర్ట్‌లో ఈ చీరను తయారు చేశారు. దీనికి మ్యాచింగ్‌గా ఎరుపు రంగు బ్లౌజ్‌ను నిర్మల ఎంచుకున్నారు.
‘దహీచీనీ’ని తినిపించిన రాష్ట్రపతి
లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. ఈ సందర్భంగా నిర్మలకు రాష్ట్రపతి ‘దహీచీనీ (పెరుగు చక్కెర)’ను తినిపించి.. శుభాకాంక్షలు తెలియజేశారు. ఫైనాన్స్ మినిస్టర్ వెంట ఆ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి, సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతిని ఆర్థిక మంత్రి కలవడం ఆనవాయితీ. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశమై.. బడ్జెట్‌ను ఆమోదించింది.
కుంభమేళా తొక్కిసలాటపై ప్రకటనకు ప్రతిపక్షాల పట్టు నిరాకరించిన స్పీకర్..పలువురు సభ్యుల వాకౌట్
న్యూఢిల్లీ: మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై చర్చ చేపట్టాలంటూ పార్లమెంట్ సమావేశాలను పలువురు ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ ప్రారంభిస్తున్న టైమ్‌లో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ సహా కొందరు సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కుంభమేళా తొక్కిసలాటపై ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశారు. మృతుల సంఖ్యను దాస్తున్నారంటూ అఖిలేశ్ ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు పట్టుబట్టగా.. స్పీకర్ ఓం బిర్లా నిరాకరించారు. ప్రతిపక్షాల నిరసన మధ్యనే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు. 5 నిమిషాల పాటు నినాదాలు చేసిన ప్రతిపక్ష సభ్యుల్లో కొందరు.. వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం కొద్దిసేపటికి మళ్లీ వచ్చి తమ సీట్లలో కూర్చున్నారు.