రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘దేశవృద్ధి కోసం ప్రభుత్వ వ్యయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని..అందులో భాగంగానే తాజా బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని 33శాతం పెంచి రూ.10లక్షల కోట్లకు చేర్చామని వెల్లడించారు. విద్యుత్ సహా అనేక రంగాల్లో కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలను రాష్ట్రాలు కూడా అమలు చేసేలా ఒత్తిడి తీసుకొస్తున్నామని చెప్పారు. ఢిల్లీలోని PHD ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులతో బడ్జెట్ చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోవడంతో వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తేవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇందుకు కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసింది. అయితే పెట్రోల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చేవాలన్న డిమాండ్ పై కొన్ని రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వివిధ పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఇన్ కమ్ తగ్గిపోతుందనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.