యాదగిరిగుట్ట, వెలుగు : హిందీ రాదని ఎంపీ రేవంత్‌రెడ్డిని అవమానించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే క్షమాపణ చెప్పాలని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేసి తప్పించుకోవడం కేంద్రానికి పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. తెలుగు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులకు అగౌరవపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు, రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్‌కు వీఆర్‌ఎస్ ఖాయమన్నారు. రాష్ట్రాన్నే అభివృద్ధి చేయలేని కేసీఆర్ దేశానికి ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఎంపీపీ చీర శ్రీశైలం, మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపాటి మధుసూదన్‌రెడ్డి, తుర్కపల్లి మండల అధ్యక్షుడు శంకర్‌నాయక్, సర్పంచ్ కానుగు కవిత, ఎంపీటీసీలు మోహన్‌బాబు నాయక్, ప్రతిభ రాజేశ్ పాల్గొన్నారు.
పురుగు, గడ్డి మందుల శాంపిళ్ల సేకరణ
యాదాద్రి, వెలుగు : పురుగు, గడ్డి మందుల తయారీపై సెంట్రల్ ఇన్‌స్పెక్టిసైడ్ బోర్డు దృష్టి పెట్టింది. ఇటీవల కొన్ని క్రిమి సంహారక మందుల వల్ల పంటలకు నష్టం జరుగుతుందని, రూల్స్ పాటించకుండా మందు తయారు చేయడంతో నీటిలో సరిగా కలవడం లేదని, స్ప్రే చేసిన తర్వాత చేన్లపై ఎక్కువ ప్రభావం చూపుతుండడంతో మొక్కలు మాడిపోతున్నాయని ఫిర్యాదులు అందాయి. దీంతో మందుల తయారీలో కంపెనీలు రూల్స్ పాటిస్తున్నాయా ? లేదా ? వీటి వాడకం వల్ల పంటలకు లాభమా ? నష్టమా ? అని తెలుసుకునేందుకు సెంట్రల్ బోర్డు అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌ను రంగంలోకి దించింది. యాదాద్రి జిల్లాలో క్రిమి సంహారక మందులు, ఫర్టిలైజర్స్ తయారు చేసే కంపెనీలు 12 ఉండగా ఇందులో 5 కంపెనీలు పూర్తి స్థాయిలో, 7 కంపెనీలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. ఇందులో రెండు కంపెనీల నుంచి పురుగు, గడ్డి మందుల శాంపిల్స్ సేకరించాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో అగ్రికల్చర్ ఆఫీసర్లు మంగళవారం శాంపిళ్లను సేకరించారు. వీటిని హర్యానా ఫరీదాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్పెక్టిసైడ్ లేబరేటరీకి పంపిస్తారు. అక్కడ వాటిని పరీక్షించిన తర్వాత రూల్స్‌కు విరుద్ధంగా ఉంటే సదరు కంపెనీలపై చర్యలు తీసుకుంటామని
ఆఫీసర్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ వర్తించదా ?
యాదగిరిగుట్ట, వెలుగు: ప్రొటోకాల్ పాటించకపోవడం, తమను పిలవకుండానే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు మంగళవారం యాదగిరిగుట్టలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చీర శ్రీశైలం, వంగపల్లి సర్పంచ్ కానుగు కవిత బాలరాజు గౌడ్ మాట్లాడుతూ ఆఫీసర్లు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎలాంటి ప్రొటోకాల్ లేని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటించని ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో వెహికల్స్ భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో మాట్లాడడంతో వారు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజుగౌడ్, తుర్కపల్లి అధ్యక్షుడు ధనావత్ శంకర్‌నాయక్, మండల ప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్‌రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు చైతన్య పాల్గొన్నారు.
మన ఊరు మన బడితో స్కూళ్ల అభివృద్ధి
తుంగతుర్తి, వెలుగు : సర్కార్ స్కూళ్ల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సూర్యాపేట కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ చెప్పారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి కేజీబీవీ, ప్రైమరీ, రామన్నగూడెంలోని ప్రైమరీ స్కూల్‌లో మన ఊరు మన బడి కింద జరుగుతున్న పనులను మంగళవారం డీఈవో అశోక్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మన బడి ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం రానుందన్నారు. ప్రైమరీ స్కూల్‌లో గతంలో నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణాలు, వాటి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. టీచర్లు సమయపాలన పాటించి, స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీనర్సయ్య యాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, ఎంపీడీవో విజయ, శ్రీనివాస్‌రెడ్డి, కొండయ్య, అశోక్, సందీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మోసం చేసిన టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి
నల్గొండ అర్బన్, వెలుగు : హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన టీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ‘ప్రజా గోస బీజేపీ భరోసా యాత్ర’లో భాగంగా మంగళవారం ముషంపల్లి, వెలుగుపల్లి, దుప్పలపల్లి, రసూల్‌పురతో పాటు వివిధ గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 15న నల్గొండలో యాత్ర ముగింపు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో గోలిమధుసూదన్‌రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పోతెపాక సాంబయ్య, పాలకూరి రవిగౌడ్, బోగరి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.