అందుకే టమాట ధరలు పెరిగాయి : పార్లమెంట్ లో మంట

దేశ వ్యాప్తంగా  టామాట ధరల పెరుగుదలపై పార్లమెంట్ లో హాట్ డిస్కషన్ జరిగింది. ఉత్తరాదిన  భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడం వల్లే టమాట ధరలు పెరిగాయని  లోక్ సభలో  కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  ఎంపీ కళానిధి వీరస్వామి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.  పంట సీజన్ మార్పు, కర్ణాటక కోలార్ జిల్లాలో టమాట పంటకు  వైట్ ఫ్లై తెగులు, ఉత్తర భారతదేశంలో ఒక్కసారిగా రుతుపవనాలు ప్రవేశించడం, భారీ వర్షాల కారణంగా రవాణా సదుపాయాలు దెబ్బతినడం వల్లే టమాట రేట్లు పెరిగాయని చెప్పారు.

దేశీయంగా ఉత్పత్తి తగినంత లేకపోవడం, దిగుమతి చేసుకోవడం కారణంగా కందిపప్పు ధర పెరిగిందని నిర్మలాసీతారామన్ వెల్లడించారు. వ్యవసాయ సంబంధిత  ఎరువులు, పురుగు మందుల విషయంలో హోల్‌సేల్ ధరల సూచి, ద్రవ్యోల్బణం గత ఏడాది కంటే తక్కువగానే ఉన్నాయని చెప్పారు.  ప్రభుత్వం ఉల్లి, పప్పు దినుసులను బఫర్ స్టాక్ నుంచి విడుదల చేస్తూ ధరలను నియంత్రిస్తోందన్నారు.  ధరల స్థిరీకరణ నిధి నుంచి బఫర్ స్టాక్ నిర్వహణ జరుగుతోందన్నారు. అంతేగాకుండా  ట్రేడర్లకు స్టాక్ నిల్వ పరిమితి విధించడం, అక్రమ నిల్వలకు ఆస్కారం లేకుండా నిఘా పెడుతున్నామన్నారు. అవసరానికి తగ్గట్టు ఎగుమతి, దిగుమతి పాలసీలను మార్చడం వంటి చర్యలు  చేపడుతున్నామని చెప్పారు.

నిరుపేదలకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా ఆహార పదార్థాల పంపిణీ  చేస్తున్నామని చెప్పారు. దీని ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతోందన్నారు.  భారత్ దాల్  పేరుతో సబ్సిడీపై శనగ పప్పును ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని చెప్పారు నిర్మలా సీతారామన్