న్యూఢిల్లీ: ఇండియా మార్కెట్కోసం ఆరు కొత్త మోడళ్లను తయారు చేయడానికి 600 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5.300 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు నిస్సాన్ , రెనాల్ట్ తెలిపాయి. వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఇండియా సహా మూడు మార్కెట్లలో కలిసి పనిచేయాలని ఇవి ఇటీవల నిర్ణయించుకున్నాయి. నిస్సాన్ జపాన్ ఆటో మేజర్ కాగా, రెనాల్ట్ ఫ్రెంచ్ ఆటోమొబైల్ కంపెనీ. ‘‘ఈ పెట్టుబడి కొత్త మోడల్స్ తయారీ కోసమే కాకుండా ప్రపంచంలోనే మూడవ అతిపెద్దది అయిన ఇండియా మార్కెట్లో అవకాశాలను దక్కించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎగుమతుల కోసం ఇండియాను ఒక బేస్‌గా ఉపయోగించుకుంటాం.
ఈవీ టెక్నాలజీ కూడా చాలా ముఖ్యం కాబట్టి వీటినీ తయారు చేస్తాం’’ అని నిస్సాన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్వనీ గుప్తా అన్నారు. భారత్‌లో ఆరు కొత్త మోడళ్లను తయారు చేస్తామని, అన్నీ కామన్ ప్లాట్‌ఫారమ్‌లపై నిర్మిస్తామని రెండు కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపాయి. - కాంపోనెంట్‌లు, ఇంజినీరింగ్, డిజైన్ విషయంలో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు వెల్లడించాయి. ఈ బండ్లలో రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీలు) ఉంటాయి. భారతదేశంలో ఈ కంపెనీలు మొదటిసారిగా ఈవీలను తయారు చేస్తున్నాయి. మిగిలినవి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్అని తెలిపాయి. చెన్నై కార్ల ప్లాంట్‌లో ఇవి తయారవుతాయి. వీటికి అక్కడ ఆర్ అండ్ డీ సెంటర్ కూడా ఉంది. ఇండియాతో పాటు లాటిన్ అమెరికా, ఐరోపా మార్కెట్లలోనూ నిస్సాన్, రెనాల్ట్ కలసి పనిచేస్తాయి. రెండు కంపెనీలకు కలిసి 2022లో భారతీయ ఆటో మార్కెట్‌లో దాదాపు 3 శాతం వాటా ఉంది. నిస్సాన్ మాదిరిగా రెనాల్ట్కు చైనా, యునైటెడ్ స్టేట్స్, జపాన్ మార్కెట్లలో భారీ వాటా లేదు. చెన్నై ప్లాంట్ సంవత్సరానికి 500,000 బండ్లను తయారు చేస్తుంది. అయితే 2022లో రెనాల్ట్ భారతదేశంలో 87,000, నిస్సాన్ 35,000 యూనిట్లను మాత్రమే అమ్మగలిగాయి.