కాజీపేట, వెలుగు : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) తో వరంగల్ ఎన్ ఐటీ అవగాహన ఒప్పందం చేసుకుంది. సోమవారం బీఐఎస్ 78వ వార్షికోత్సవం సందర్భంగా ఆన్ లైన్ వేదికగా జరిగిన వేడుకల్లో కేంద్ర వినియోగదారుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, శాఖ కార్యదర్శి నిధి ఖరే, బీఐఎస్ డీజీ ప్రమోద్ కుమార్ తివారీ సమక్షంలో హైదరాబాద్ శాఖ డైరెక్టర్ పీవీ శ్రీకాంత్, వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా పీవీ శ్రీకాంత్ మాట్లాడుతూ 78 ఏండ్లుగా భారతీయ ప్రమాణాల రూపకల్పనలో బీఐఎస్ విశేష సేవలందిస్తుందని పేర్కొన్నారు. ఐఎస్ఐ మార్కు, బంగారు ఆభరణాలకు హాల్ మార్కు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్ మార్కు ద్వారా వినియోగదారులకు భరోసా ఇస్తోందన్నారు. వస్తు ప్రమాణాలపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించేందుకు సాంకేతిక పరిశోధనల్లో భాగస్వామ్యులను చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నట్టు చెప్పారు. నిట్ ప్రొఫెసర్లు శ్రీనివాసాచార్య, రతీశ్కుమార్, వేణు వినోద్, శిరీష్, శ్రీనివాసరావు, బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ తన్నీరు రాకేశ్ పాల్గొన్నారు.