హనుమకొండ/ కాజీపేట, వెలుగు: వరంగల్ లోని నిట్‌క్యాంపస్ సాంకేతికోత్సవానికి రెడీ అయ్యింది. శుక్రవారం నుంచి టెక్నోజియాన్ ఉత్సవాలు ప్రారంభం కానుండగా..దేశంలోని వివిధ సాంకేతిక విద్యాసంస్థల నుంచి 3 వేల మంది స్టూడెంట్స్ తరలిరానున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వరంగల్ నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుభూది తెలిపారు. నిట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్‌లోని సెనేట్ హాలులో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు టెక్నోజియాన్ ప్రారంభమవుతుందని, 21వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ‘ఇన్జీనియస్’ అనే థీమ్ తో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ముఖ్య అతిథిగా ఏరో స్పేస్ సైంటిస్ట్, డీఆర్డీవోకు చెందిన బ్రహ్మోస్, అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నాగ్, త్రిశూల్ లాంటి ప్రతిష్టాత్మక క్షిపణుల రూపకల్పనలో భాగస్వాములైన ప్రొఫెసర్ శ్రీనివాసన్ సుందర్ రాజన్, రెడ్ బస్ సీఈవో ప్రకాశ్ సంగం, ఇస్రో సైంటిస్ట్ టీఎన్సురేశ్ కుమార్, వంశీ కూరపాటి హాజరవుతారన్నారు. టెక్నోజియాన్‌లో 40 టాప్ క్లాస్ టెక్నికల్, స్పాట్లైట్ఈవెంట్లు, వర్క్‌షాప్స్ నిర్వహిస్తారని చెప్పారు. అన్ని ప్రోగ్రామ్స్‌కు వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన విద్యార్థులను కో ఆర్డినేటర్లుగా నియమించామన్నారు. టెక్నోజియాన్కోఆర్డినేటర్ హరిప్రసాద్, ప్రొఫెసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.