రోడ్డు ప్రమాదాల్లో 60 శాతం మృతులు 18 నుంచి 34 ఏండ్ల వారే: గడ్కరీ

రోడ్డు ప్రమాదాల్లో 60 శాతం  మృతులు 18 నుంచి 34 ఏండ్ల వారే: గడ్కరీ
  • యాక్సిడెంట్లపై విదేశాల్లో మీటింగ్ లు జరిగినప్పుడు తలదించుకుంటున్నా
  • చాలా మంది వాహనదారులు చట్టానికి భయపడడం లేదు
  • యువతకు ట్రాఫిక్ క్రమశిక్షణపై అవగాహన కల్పించాలి
  • పిల్లలకు కూడా నిబంధనలు వివరించాలని సూచన

న్యూఢిల్లీ:  దేశంలో ఏడాదికి సగటున 1.78 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని.. అందులో 60 శాతం మంది 18 నుంచి -34 ఏండ్ల మధ్య వయసు వారే ఉంటున్నారని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇది చాలా దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్​ యాక్సిడెంట్స్​పై అంతర్జాతీయ సమావేశాలకు హాజరైనప్పుడు.. తాను తలదించుకుంటున్నానని, తన ముఖాన్ని దాచుకునేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు.

లోక్‌‌‌‌‌‌‌‌సభలో గురువారం రోడ్డు ప్రమాదాలపై చర్చ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ మాట్లాడారు. దేశంలో ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, సిటీల్లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. రోడ్డుపై ట్రక్కులు పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, చాలా ట్రక్కులు లేన్ క్రమశిక్షణ పాటించడం లేదని అన్నారు. తాను రహదారుల మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు.. ప్రమాదాలను 50% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు.

అయితే, ప్రమాదాల సంఖ్యను తగ్గించడం పక్కనపెడితే.. అది పెరిగిందన్న విషయాన్ని ఒప్పుకోవడానికి తనకు ఎలాంటి సందేహం లేదని అన్నారు. కానీ, ప్రభుత్వం తరఫున ఎంత చేసినా ఇప్పటికీ చాలా మంది ప్రజలు చట్టానికి భయపడడం లేదన్నారు. స్వయంగా తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని గుర్తు చేసుకున్నారు.