అసలు ‘కైలాస’ దేశమే లేదు.. అన్నీ సొల్లు ముచ్చట్లే.. వెలుగులోకి ‘నిత్యానంద’ బాగోతం

అసలు ‘కైలాస’ దేశమే లేదు.. అన్నీ సొల్లు ముచ్చట్లే.. వెలుగులోకి ‘నిత్యానంద’ బాగోతం

ఇండియాలో పలు కేసుల్లో ఇరుక్కుని దేశం విడిచి పారిపోయిన నిత్యానంద బాగోతం బయటపడింది. ‘కైలాస’ అనే హిందూ దేశం సృష్టించానని, ధర్మ పరిరక్షణ కాంక్షించే హిందువులు తన దేశంలో ఉండొచ్చని నిత్యానంద చెప్పినవన్నీ ఉత్తుత్తి కబుర్లేనని తేలిపోయింది. అసలు ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ (USK) అనే దేశమే లేదని, దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశంలో నిత్యానంద, అతని అనుచర గణం భూ కబ్జాకు పాల్పడినట్లు తాజాగా ‘ది న్యూయార్స్ టైమ్స్’ ఒక సుదీర్ఘ కథనంలో వెల్లడించింది.

ఈ నిత్యానంద సృష్టించిన ఫేక్ దేశమైన ‘కైలాస’కు చెందిన 20 మందిని గత వారం బొలీవియాలో అరెస్ట్ చేశారు. ఇండియా, అమెరికా, స్వీడన్, చైనాకు చెందిన నిత్యానంద శిష్య బృందంలోని ఈ 20 మంది బొలీవియాలో పర్యటిస్తూ.. ఆ దేశంలో ఉన్న అమెజాన్ అడవులను వెయ్యేళ్ల పాటు లీజుకు తీసుకునేందుకు బేరసారాలు జరిపినట్లుగా ‘ది న్యూయార్స్ టైమ్స్’ పేర్కొంది. అయితే.. ఇందుకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలు చెల్లవని బొలీవియా స్పష్టం చేసింది.

బొలీవియాలో భూ కబ్జాకు యత్నించినందుకు నిత్యానంద పంపిన ఆ 20 మందిని అరెస్ట్ చేశామని బొలీవియా ప్రభుత్వం ప్రకటించింది. ఒక దేశంగా చెప్పుకుంటున్న ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’తో బొలీవియా ఎలాంటి దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించలేదని బొలీవియా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో.. నిత్యానంద చెప్పుకొచ్చిన ఆ ‘కైలాస’ దేశం ఉత్త కథేనని తేలిపోయింది. 

ఈ ‘కైలాస’ గురించి నిత్యానంద అప్పట్లో చేసిన హడావిడి అంతాఇంతా కాదు. ఈ దేశానికి సొంత పాస్ పోర్టులు, సొంత రాజ్యాంగం ఉందని నిత్యానంద అప్పట్లో వీడియోలు విడుదల చేశారు. KAILASA's SPH Nithyananda పేరుతో ఉన్న నిత్యానంద యూట్యూబ్ ఛానల్కు 5 లక్షల మందికి పైగా సబ్ స్క్రైబర్లు ఉండటం కొసమెరుపు. kailaasa.org పేరుతో ఒక వెబ్సైట్ను కూడా నిత్యానంద నడిపిస్తున్నాడు. 2019లో అత్యాచారం, చిన్నారుల అక్రమ రవాణా కేసుల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరైన నిత్యానంద ఇండియా నుంచి పారిపోయాడు. ఇండియా నుంచి కనుమరుగైన కొన్నాళ్లకు ‘కైలాస’ దేశం స్థాపించినట్లు ప్రకటించాడు. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు ఈ ఉనికి లేని ‘కైలాస’ దేశం నుంచి ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అంతర్జాతీయ నేతలతో ఫొటోలకు ఫోజులిచ్చారు.

మన దేశం నుంచి పారిపోయే లోపు నిత్యానంద పేరు ఎలా మారుమోగిందో తెలిసే ఉంటుంది. సినీ నటి రంజితతో నిత్యానంద రాసలీలలు సాగిస్తున్న వీడియో బయటకు రావడం అప్పట్లో పెద్ద సంచలనం. ఇప్పుడు ఉన్నంత యాక్టివ్గా 2010లో సోషల్ మీడియా లేదు గానీ న్యూస్ ఛానల్స్లో నిత్యానంద, రంజితల రాసలీలల వీడియో హల్చల్ చేసింది. తమిళ ఛానల్ SUN TV తొలుత ఆ వీడియో రికార్డింగ్స్ను బయటపెట్టింది. తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కూడా అప్పట్లో నిత్యానంద రాసలీలల ఎపిసోడ్ చర్చనీయాంశమైంది. ఆ వీడియో ఎవరో దురుద్దేశపూర్వకంగా సృష్టించారని, అందులో ఉన్నది తానూ, రంజిత కాదని నిత్యానంద చెప్పుకొచ్చాడు. అయితే.. ఫోరెన్సిక్ కూడా ఆ వీడియోలో ఉంది నిత్యానంద, రంజితలేనని తేల్చి చెప్పడంతో ఈ రాసలీలల సాములోరి బాగోతం బట్టబయలైంది.