ఐక్యరాజ్య సమితి భేటీలో నిత్యానంద ‘కైలాస’ ప్రతినిధులు

వివాదాస్పద, స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి చర్చనీయాంశంగా మారారు. కైలాస పేరుతో నిత్యానంద ఓ దేశాన్ని సృష్టించుకున్నారన్న వార్తలు మాత్రమే ఇన్ని రోజులూ విన్నాం. కానీ ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఓ సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశాలకు కైలాస దేశం నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యారు. తనను తాను విజయప్రియ నిత్యానందగా పరిచయం చేసుకున్న ఓ మహిళా ప్రతినిధి.. భారత్ పై ఆరోపణలు చేశారు. నిత్యానందను, తమ దేశ ప్రజలను భారత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని వ్యాఖ్యానించారు. జెనీవాలో జరిగిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ (సీఈఎస్‌సీఆర్‌) సమావేశంలో మాట్లాడిన ఆమె.. ‘‘హిందువుల కోసం తొలి సార్వభౌమ దేశం ‘కైలాస’ ఏర్పాటుచేసిన నిత్యానంద హిందూ సంప్రదాయాలను, నాగరికతను పునరుద్ధరిస్తున్నారు’’ అని  పేర్కొన్నారు. అనంతరం కైలాస నుంచే వచ్చిన మరో ప్రతినిధి ఈఎన్‌ కుమార్‌ సైతం ఈ సమావేశంలో పాల్గొని, ఉపన్యసించారు. కాగా అత్యాచారం, అపహరణ వంటి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద.. 2019లో దేశం నుంచి పారిపోయి... 2020లో ఈక్వెడార్‌ తీరానికి దగ్గర్లోని ఓ ద్వీపాన్ని కైలాస దేశంగా ప్రకటించారు.