ఫ్లెక్స్- ఇంజన్​ బండ్లపై జీఎస్టీని తగ్గించండి : నితిన్ గడ్కరీ

ఫ్లెక్స్- ఇంజన్​ బండ్లపై జీఎస్టీని తగ్గించండి : నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ: ఫ్లెక్స్- ఇంధన వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని 12 శాతానికి తగ్గించే అంశాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రులు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పరిశీలించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం అన్నారు. ఇక్కడ నిర్వహించిన ఐఎఫ్​జీఈ  ఇండియా బయో-ఎనర్జీ, టెక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోలో గడ్కరీ ప్రసంగిస్తూ చమురు దిగుమతులను తగ్గించి, జీవ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

జీఎస్టీ తగ్గింపు కోసం వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మద్దతు అవసరమని, వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తనకు హామీ ఇచ్చారని వెల్లడించారు.  ఫ్లెక్స్​ వెహికల్స్​ పెట్రోల్,  ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమంతో నడుస్తాయి.  ప్రస్తుతం సాధారణ వెహికల్స్​పై 28 శాతం, ఎలక్ట్రిక్ వెహికల్స్​పై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారు.