రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ‘క్యాష్ లెస్ ట్రీట్మెంట్ టు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్’ పేరిట కొత్త స్కీమ్ ను ప్రకటించింది. ఈ పథకం ప్రకారం..ప్రమాదం జరిగిన 24 గంటల్లో బాధితుడికి 7 రోజుల చికిత్స ఖర్చు లేదా గరిష్టంగా రూ. 1.5 లక్షలు వెంటనే అందజేస్తారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందజేసిన తర్వాతే ట్రీట్మెంట్ అమౌంట్ ఇవ్వనున్నారు. అలాగే.. హిట్ అండ్ రన్​లో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షలు అందజేయనున్నారు.

మంగళవారం పలు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులతో కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమావేశమయ్యారు. అనంతరం ఆయన ఢిల్లీలోని భారత్ మండపంలో మీడియాతో మాట్లాడుతూ.."రోడ్డు భద్రతకే మా మొదటి ప్రాధాన్యం. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.8 లక్షల మంది చనిపోయారు. అందులో 30 వేల మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే మృతిచెందారు. మరో బాధాకరమైన విషయం ఏమిటంటే.. మృతుల్లో  66% మంది 18 నుంచి -34 ఏండ్ల మధ్య వయస్సు గలవారే.

ఇక స్కూళ్లు, కాలేజీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం వల్ల జరిగిన ప్రమాదాల్లో 10 వేల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు వెహికల్ నడపడం వల్ల జరిగిన ప్రమాదాల్లో దాదాపు 3 వేల మంది మరణించారు" అని నితిన్ గడ్కరీ వివరించారు. రోడ్డు ప్రమాద బాధితులను దృష్టిలో ఉంచుకుని ‘క్యాష్ లెస్ ట్రీట్మెంట్ టు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్’  స్కీమ్ తెచ్చామని నితిన్ గడ్కరీ తెలిపారు.

ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా పలు రాష్ట్రాల్లో అమలు చేసి సక్సెస్ అయ్యామని.. ఇక దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. దేశంలో  22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని వెల్లడించిన ఆయన.. కొరతను తీర్చేందుకు కోసం కొత్త విధానాన్ని రెడీ చేస్తున్నామని చెప్పారు. మన దేశం నాలుగు నెలల క్రితమే ఆటోమొబైల్ రంగంలో జపాన్‌ను వెనుకకు నెట్టి మూడవ స్థానానికి చేరిందని తెలిపారు.స్క్రాపింగ్ కారణంగా ఆటోమొబైల్ రంగం బాగా అభివృద్ధి చెందుతున్నదని గడ్కరీ పేర్కొన్నారు.