రోడ్డు ప్రమాదాలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. నాసిరకం రోడ్లు నిర్మిస్తే ప్రమాదాలకు కాంట్రాక్టర్లు, ఇంజినీర్లను బాధ్యులుగా పరిగణించి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు.. ఇండస్ట్రీ బాడీ సీఐఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన నితిన్ గడ్కరీ.. రోడ్డు ప్రమాదాల్లో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్ గా ఉందన్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను సగానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
2023లో రోడ్డు ప్రమాదాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం దేశంలో ఐదు లక్షల ప్రమాదాలు జరిగాయన్నారు నితిన్ గడ్కరీ.ఫలితంగా లక్షా 72 వేలమంది మరణించారని వెల్లడించారు.మరణాల రేటు 66.4 శాతం ఉందన్నారు. ఇందులో 1,14,000 మంది 18 నుంచి -45 ఏళ్ల మధ్య వయస్సు గలవారు .. 10,000 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. హెల్మెట్ లేని కారణంగా 55 వేల మంది, సీటు బెల్టు పెట్టుకోని కారణంగా 30 వేల మంది మరణించారని చెప్పారు.
హైవేలపై ఉన్న బ్లాక్‌స్పాట్‌లను సరిచేయడానికి హైవే మంత్రిత్వ శాఖ రూ.40 వేల కోట్లు వెచ్చిస్తోందని గడ్కరీ చెప్పారు. దేశంలో తీవ్రమైన డ్రైవర్ల కొరతను పరిష్కరించడానికి డ్రైవర్లకు శిక్షణ , ఫిట్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని పరిశ్రమ , ఇతర వాటాదారులను గడ్కరీ కోరారు.