కెరీర్ ప్రారంభం నుంచి లవర్ బాయ్ పాత్రలతో ఆకట్టుకున్న ‘నితిన్’.. వాటికి గుడ్ బై చెప్పి, మాస్ రూట్ వైపు మళ్లి చాలా కాలమే అయ్యింది. ఆ కోవలోనే ఇప్పుడు పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ చేశాడు. విడుదలైన టీజర్‌లో, ట్రైలర్‌లలో యాక్షన్ అవతార్‌లో ఆకట్టుకున్నాడు. దీంతో సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ ఆగస్టు 12వ తేదీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ అందుకు తగ్గట్టుగానే ఉందా? నితిన్ ప్రయత్నం ఫలించిందా? చూద్దాం.
కథేమిటంటే..
సిద్ధార్థ (నితిన్) సివిల్స్ టాపర్. పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఈ గ్యాప్‌లో లైఫ్‌ని తనకి నచ్చినట్టు ఎంజాయ్ చేస్తుంటాడు. అప్పుడే అతని జీవితంలోకి స్వాతి (కృతి) ప్రవేశిస్తుంది. మొదటి చూపులోనే ఆమె ప్రేమలో పడిపోతాడు సిద్ధు. అయితే ఆమె మాత్రం తాను వచ్చిన పని చూసుకుని వాళ్ల ఊరికి తిరిగి వెళ్లిపోతుంది. దాంతో ఆమెని వెతుక్కుంటూ మాచర్ల వెళ్తాడు. ఆ సమయంలో స్వాతిని స్థానిక ఎమ్మెల్యే రాజప్ప (సముద్ర ఖని) కొడుకు చంపబోతాడు. అడ్డుపడి కాపాడతాడు సిద్దూ. సరిగ్గా అప్పుడే ఆ జిల్లాకి కలెక్టర్‌గా నియమించినట్టు తెలుస్తుంది. దాంతో రాజప్ప కొడుక్కి గట్టిగానే బుద్ధి చెప్తాడు. రాజప్ప కారణంగా కొన్ని సంవత్సరాల నుంచి మాచర్లలో ఎలక్షన్లు జరగడం లేదని తెలుసుకున్న సిద్ధు.. ఎలాగైనా ఎన్నికలు జరిపిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. దాంతో ఇద్దరి మధ్య నిప్పు రాజుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? తాను అనుకున్నది సిద్ధు ఎలా సాధించాడు ? అసలు స్వాతికి రాజప్పకి ఏంటి సంబంధం ? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే..
ఐఏఎస్ ఆఫీసర్ అనగానే క్లాస్‌గా ఊహిస్తాం. కానీ ఇక్కడ హీరో ఊర మాస్. అలా ఎలా కుదురుతుంది అని ప్రేక్షకుడు ఎక్కడ అడుగుతాడోనని ట్రైలర్‌లోనే దానికి దర్శకుడు జస్టిఫికేషన్ ఇచ్చేశాడు. దాంతో ఏదో వెరైటీగా ట్రై చేసినట్టున్నాడు అనే అంచనాలు ఏర్పడిపోయాయి. అదే దృష్టితో థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకుడికి సినిమా మొదలయ్యాక కానీ అసలు సంగతి అర్థం కాదు. సరదాగా తిరిగే కుర్రాడు. అతనిని ప్రాణంగా ప్రేమించే బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరి మధ్య షికార్లు, సాంగ్స్ ఇలా సాగుతుంది. కట్ చేస్తే నువ్వు నా ఫ్రెండే తప్ప... ప్రేమ లేదని హీరో చెప్పడం అమ్మాయికి చెబుతాడు. అనంతరం అతని లైఫ్‌లోకి ఇంకో అమ్మాయి రావడం.. ఆమెని తొలి చూపులోనే గాఢంగా ప్రేమించేస్తాడు. ఆమెకి ఏదో సమస్య ఉండటం.. అందులో ఇతడు ఇన్‌వాల్వ్ అయిపోవడం.. ఆమెతో పాటు ఊరి జనాన్ని కూడా కాపాడేయడం...ఇలాంటివి ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసేసి ఉంటాం. ఈ కథతో నితిన్‌ని దర్శకుడు ఎలా కన్విన్స్ చేశాడనేది మొదటి ప్రశ్న. బహుశా ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర తాను ఇంతవరకు చేయలేదు కాబట్టి ఎస్ అని ఉండొచ్చు. పోనీ ఆ ఎపిసోడ్స్ అయినా కొత్తగా ఉన్నాయా అంటే అదీ లేదు. క్లాస్‌గా చూపిస్తే కొత్తగా ఉండదనుకున్నాడో ఏమో కానీ నితిన్ పాత్రని మాస్‌గా మార్చేశాడు. అయినా కూడా ఒరిగిందేమీ లేదు. నాలుగు పంచ్ డైలాగులు, ఆరు ఫైట్లు తప్ప. ముప్ఫయ్యేళ్ల నుంచి ఎలక్షన్ జరగని ఊరిలో విలన్‌ని కేవలం కొట్టి ఓడించేస్తే చాలు అనుకుంటే దానికి ఓ ఐఏఎస్ ఆఫీసరే రావాలా ? బలం ఉన్నవాడు ఎవడైనా చాలు కదా అనే ప్రశ్న ఉదయిస్తుంది.
రొటీన్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్...
కానీ ఇక్కడ జరిగిందేమిటంటే ఎక్కడో వేరే స్టేట్‌లో ఓ ఐఏఎస్ ఆఫీసర్ సాధించిన విజయాన్ని చూసి ఇన్‌స్పైర్ అయిపోయాడు డైరెక్టర్. అతనిని హీరోగా పెట్టుకుని కథ అల్లేసుకున్నాడు. రియల్ లైఫ్‌లో మసాలా ఉండదు కాబట్టి దాన్ని తన స్టోరీకి బాగా దట్టించే ప్రయత్నం చేశాడు. అసలు సోల్ మిస్ అయిపోతుందనే విషయాన్ని మర్చిపోయాడు. కలెక్టర్‌కి ఫిజికల్ ఫిట్‌నెస్ కంటే మెంటల్ స్ట్రాంగ్‌నెస్ చాలా ఉంటుంది. ఆ విషయం దర్శకుడికి అసలు స్ఫురించనే లేదు. రియల్ లైఫ్‌లో అయితే ఆ ఐఏఎస్ అధికారి ఇలా అందరినీ చితక్కొట్టేసి ఉండడు కదా. పంచ్ డైలాగులు కొట్టి ఉండడు కదా. బ్రెయిన్ అప్లై చేసే ఉంటాడు కదా. అది కాస్తయినా చూపించి ఉంటే బాగుండేది. కానీ ఎంతసేపూ హీరో ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని, మాస్ ఎలిమెంట్స్ లేకపోతే ఆడియెన్స్ ఒప్పుకోరేమోనని భయపడి దీన్ని రొటీన్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మార్చేశాడు. సినిమా మొత్తంలో ప్రేక్షకులకి నచ్చే సీన్ ఏదైనా ఉంది అంటే.. రీసెంట్‌గా వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’లోని డైలాగ్‌ని నితిన్ చెప్పే సీన్ ఒక్కటే. ఆ మూవీని తెలుగులో నితిన్ వాళ్ల ప్రొడక్షన్ హౌసే రిలీజ్ చేసింది. దాంతో దాన్ని వాడారు. కారణం ఏదైనా కమల్ డైలాగ్‌ని నితిన్ చెప్పడం, బ్యాగ్రౌండ్‌లో ‘విక్రమ్.. విక్రమ్’ అంటూ వినిపించడం బాగుంది. ఇంతకు మించి కొత్తదనమేదీ ఆశించడానికి లేదు.
ఎవరెలా చేశారంటే..
లుక్స్ పరంగా నితిన్ చాలా బాగున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్‌గా చక్కని గెటప్‌లో కూల్‌గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ లలో అగ్రెసివ్‌గానూ మెప్పించాడు. అయితే కొత్తగా నటించడానికి తనకేమీ స్కోప్ దొరకలేదు. ఇలాంటి యాక్షన్ అతను ఇప్పటికే చాలాసార్లు చేసేశాడు. కృతిశెట్టి ఎప్పటిలాగే అందంగా ఉంది. కానీ నటనపరంగా మాత్రం పూర్తి మార్కులు వేయలేం. సినిమాకి కీలకమైన పాత్రే తనది. అయినా కూడా ఎలాంటి ప్రత్యేక ముద్ర వేయలేకపోయింది. హీరో ఫ్రెండ్‌గా కేథరీన్ థ్రెసా చేసిన పాత్ర చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. రాజప్పగా, అతని కొడుకుగా సముద్రఖని రెండు పాత్రల్లో కనిపించారు. అయితే ఆయన టాలెంట్‌కి తగిన రోల్ కాదు. ఖనిలో ఎంత గొప్ప విలన్ ఉన్నాడో చాలాసార్లు చూశాం. కానీ ఇందులో వైవిధ్యత చూపించే చాన్సే ఆయనకి ఇవ్వలేదు. దాంతో సోసోగా మిగిలిపోయింది ఆయన క్యారెక్టర్. వెన్నెల కిశోర్‌కి లెంగ్తీ రోల్ దొరికింది. అయితే తన సీన్స్ మొదట్లో కాస్త నవ్వు తెప్పించినా, ఉండేకొద్దీ కాస్త అతి అయినట్టు అనిపించి విసుగు పుట్టిస్తాయి. రాజేంద్రప్రసాద్‌కి, మురళీశర్మకి వారి స్థాయికి తగ్గ పాత్రలు ఇవ్వలేదు. అసలా క్యారెక్టర్స్ ఎవరు చేసినా వచ్చిన నష్టం లేదు. ఇంద్రజకి కూడా నటనకి పెద్ద స్కోప్ లేకపోయినా, కనిపించిన కాసేపు స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్నారామె. ఇక మిగతా వారి గురించి చెప్పుకోడానికేమీ లేదు.
టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. పాటలు పెద్ద ఎంగేజ్ చేయలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంతమాత్రమే. యాక్షన్ సీన్స్ లలో బీజీఎం మరీ లౌడ్‌గా అనిపించి ఇబ్బంది పెట్టింది కూడా. సినిమాటోగ్రఫీ బానే ఉంది. మామిడాల తిరుపతి డైలాగ్స్ కొన్నిచోట్ల మాత్రం పేలాయి. నిర్మాణ విలువలు బాగానే ఉన్నా, మిగతావేవీ వాటికి తగ్గట్టుగా లేకపోవడం వల్ల క్వాలిటీ గురించి మాట్లాడుకోలేం. కథ బాగుండి.. కథనం ఆసక్తికరంగా ఉన్న సినిమాలే ఒక్కోసారి క్లిక్ అవడానికి టైమ్ తీసుకుంటున్నాయి. మౌత్ టాక్‌తో మెల్లగా పుంజుకుంటున్నాయి. అలాంటిది ఇంత రొటీన్ కథతో, పట్టు లేని కథనంతో, ఏమాత్రం ఆకట్టుకోని సీన్స్ మాస్ ప్రేక్షకుల మనసులు దోచుకోవడమనేది అసాధ్యం. సాధారణంగా కొత్త దర్శకులు తమ మొదటి సినిమాకి చాలా నవ్యత చూపిస్తారు. కానీ రాజశేఖర్‌రెడ్డి ఎందుకు ఇలా పాత పద్ధతుల్ని ఫాలో అయ్యారనేది అర్థం కాదు. డైరెక్షన్ కొత్తయినా చాలా సినిమాలకి ఎడిటింగ్ చేసి ఉండటం వల్ల హీరో ఇమేజ్ అనే చట్రంలో పడిపోయి ఉండొచ్చేమో.
నటీనటులు : నితిన్, కృతిశెట్టి, కేథరీన్ థ్రెసా, సముద్రఖని, వెన్నెల కిశోర్, మురళీశర్మ, ఇంద్రజ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు సంగీతం : మహతి స్వరసాగర్. నిర్మాణం; సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం.ఎస్.రాజశేఖరరెడ్డి.