అసెంబ్లీకి పోటీ చేయకుండానే ఐదుసార్లు సీఎం

ఐదుసార్లు సీఎం.. హ్యాట్రిక్​ అధికారం.. అయినా 35 ఏండ్లుగా అసెంబ్లీకి పోటీ చేయలె

సీఎం అయినప్పటి నుంచి ఎమ్మెల్సీగానే నితీశ్ కుమార్

నితీశ్​ కుమార్. బీహార్​కు ఐదుసార్లు​ ముఖ్యమంత్రి. వరుసగా హ్యాట్రిక్​ కొట్టి ఇప్పుడు నాలుగోసారి అధికార పీఠం దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. కానీ, నితీశ్​ బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా పోటీ చేసి 35 ఏండ్లు అవుతోంది. 1985లో ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన పోటీ చేయడం.. గెలవడం అదే చివరిసారి. అప్పటి నుంచి ఆయన లెజిస్లేటివ్​​ కౌన్సిల్​ నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

నితీశ్​కుమార్, యోగి ఆదిత్యనాథ్​, ఉద్ధవ్​ థాక్రే. మనదేశంలోని మూడు మోస్ట్​ పాపులర్​ స్టేట్స్.. బీహార్, ఉత్తరప్రదేశ్​, మహారాష్ట్రకు వీరు ముఖ్యమంత్రులు. వీరి మధ్య ఒక కామన్​ విషయం ఉంది. అదేంటంటే.. వారు తమతమ రాష్ట్రాల్లో లెజిస్లేటివ్​​ కౌన్సిల్​కే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినా విధాన సభ ఎన్నికల్లో వీరెవరూ అసలు పోటీనే చేయలేదు. నితీశ్​కుమార్​ అయితే ఎప్పుడో 35 ఏండ్ల కిందచివరిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడడ్డారు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా విధానసభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ మాత్రం.. గోరఖ్​పూర్​ పార్లమెంట్​ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు లోక్​సభకు ప్రాతినిథ్యం వహించారు. 1998లో 26 ఏండ్ల వయసులో తొలిసారి యోగి ఎంపీగా గెలిచారు. ఇక మహారాష్ట్ర చీఫ్​ మినిస్టర్​ ఉద్ధవ్​ థాక్రే అయితే అసలు జనరల్​ ఎలక్షన్లలో పోటీనే చేయలేదు. ఉద్ధవ్, యోగి.. ఇద్దరూ కూడా తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

పోటీ చేయకపోయినా.. పార్టీని గెలిపించిండు..

నితీశ్​ విషయానికి వస్తే.. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తన పార్టీని, కూటమిని.. వరుసగా మూడుసార్లు గెలిపించారు. త్వరలో జరగనున్న బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నితీశ్​ ఇప్పటి వరకూ ఐదుసార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 2000, 2005, 2010తో పాటు 2015లో రెండుసార్లు ప్రమాణం చేశారు. నితీశ్​కుమార్​ చివరిసారిగా  1985లో బీహార్​ అసెంబ్లీకి పోటీ చేశారు. నితీశ్​ 1977లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుచున్నారు. హర్నౌత్​ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. తిరిగి 1985లో పోటీ చేసి గెలిచారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం అదే తొలిసారి కాగా.. ఎలక్షన్లలో పోటీ చేయడం అదే చివరిసారి.

లోక్​సభకు ఆరుసార్లు..

నితీశ్​ అసెంబ్లీ ఎలక్షన్ల బరిలో దిగకపోయినా.. లోక్​సభ ఎన్నికల్లో మాత్రం పోటీ చేశారు. ఆయన ఆరుసార్లు లోక్​సభకు ఎన్నికయ్యారు. చివరిసారిగా 2004లో రెండు సీట్ల నుంచి లోక్​సభకు పోటీ చేశారు. నలంద నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన బర్హ్​ నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. 2005లో బీహార్​ సీఎం అయిన తర్వాత ఎంపీ సీటుకు నితీశ్​ రాజీనామా చేశారు.

2005 నుంచి సీఎం సీటులోనే..

2014–15లో 9 నెలలు మినహా 2005 నుంచి ఇప్పటి వరకూ ఆయన బీహార్​ సీఎంగా కొనసాగుతున్నారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీతో రాజకీయ విబేధాల కారణంగా బీహార్​ సీఎం పదవికి నితీశ్​ రాజీనామా చేశారు. ఆ తర్వాత జీతన్​రామ్​ మాంఝీ ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ నాయకత్వంతో విబేధాల కారణంగా 2015లో బీహార్​ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాంఝీ పదవి నుంచి దిగిపోగా.. మళ్లీ నితీశ్​ సీఎం అయ్యారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రసాద్​ యాదవ్​ ఆర్జేడీతో కూటమి కట్టి పోటీ చేసిన నితీశ్​ బంపర్​ మెజార్టీ సాధించారు. కానీ 2017లో తిరిగి ఆయన ఎన్డీయే గూటికే చేరారు.

తొలిసారి ఎనిమిది రోజులే..

బీహార్​ ముఖ్యమంత్రిగా తొలిసారి నితీశ్ కుమార్​​ ప్రమాణస్వీకారం చేసిన సమయానికి ఆయన బీహార్​ అసెంబ్లీలోగానీ, కౌన్సిల్​లో గానీ సభ్యునిగా లేరు. అయితే ఆయన టర్మ్​ ఎనిమిది రోజుల్లోనే ముగియడంతో.. ఆయన అసెంబ్లీకిగానీ, కౌన్సిల్​కుగానీ ఎన్నికవ్వాల్సిన అవసరం లేకపోయింది. 2005 నవంబర్​లో రెండోసారి బీహార్​ సీఎంగా ప్రమాణం చేశారు. ఆ సమయంలో ఆయన ఉభయ సభల్లో సభ్యునిగా లేరు. ఆ తర్వాత ఏడాది కౌన్సిల్​కు ఎన్నికయ్యారు. చట్టం ప్రకారం.. ముఖ్యమంత్రి లేదా మంత్రులు రాష్ట్ర అసెంబ్లీ లేదా కౌన్సిల్​లో సభ్యులై ఉండడం తప్పనిసరి. దేశంలో లెజిస్లేటివ్​​ కౌన్సిల్​ ఉన్న ఆరు రాష్ట్రాల్లో బీహార్​ ఒకటి. ఈ లిస్ట్​లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, ఉత్తరప్రదేశ్​, మహారాష్ట్ర, కర్నాటక ఉన్నాయి.

బై చాయిస్ గానే ఎమ్మెల్సీ..

2012లో ఎమ్మెల్సీగా నితీశ్​ పదవీకాలం ముగిసింది. తిరిగి ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యారు. అయితే ఓటర్లను ఎదుర్కోవడానికి భయపడి నితీశ్​ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే విమర్శలు వచ్చాయి. మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా డైరెక్ట్​ ఎలక్షన్​ కంటే ఎమ్మెల్సీ రూట్​ను ఎంచుకోవడంపై నితీశ్​ క్లారిటీ ఇచ్చారు. 2012 జనవరిలో జరిగిన లెజిస్లేటివ్​  కౌన్సిల్​ సెంటినరీ సెలబ్రేషన్స్​ మీటింగ్​లో నితీశ్​ మాట్లాడుతూ.. ‘‘నేను బై చాయిస్​గానే ఎమ్మెల్సీ మార్గాన్ని ఎంచుకున్నా. అంతే తప్ప ఎటువంటి బలమైన కారణం లేదు. అప్పర్​హౌస్​ అనేది గౌరవనీయమైన సంస్థ. నా ఆరేండ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత మళ్లీ లెజిస్లేటివ్​​ కౌన్సిల్​కే ఎన్నికవుతా”అని చెప్పారు. ఇక 2015 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచారం సమయంలో తన ఫోకస్​ అంతా ఒక్క సీటుపైనే పెట్టాలని తాను భావించడం లేదని, అందుకే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వివరణ ఇచ్చారు. 2018లో వరుసగా మూడోసారి నితీశ్​ కౌన్సిల్​కు ఎన్నికయ్యారు. ఆయన టర్మ్​ 2024 వరకూ ఉంది. ఆయన పదవీకాలం పూర్తయ్యేటప్పటికి నితీశ్​ వయసు 74కు చేరుతుంది. అప్పటికి ఆయన యాక్టివ్​ పాలిటిక్స్​కు దూరమయ్యే అవకాశం ఉందని పొలిటికల్​ ఎక్స్​పర్ట్స్​ అంచనా వేస్తున్నారు.

For More News..