Nitish Kumar Reddy: మొక్కు తీర్చుకున్నాడు..మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన నితీష్ రెడ్డి

టీమిండియా యువ ఆల్ రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ లో దూసుకొస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. టీ20ల ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన నితీష్.. ఇటీవలే ఆస్ట్రేలియాలో ముగిసిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకొని అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం స్వస్థలానికి చేరుకున్న నితీష్.. శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు చేరుకున్నారు. 

అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన ఆయన తిరుమలకు వచ్చారు. మోకాళ్ల పర్వతం దగ్గర మోకాళ్లతో మెట్లను ఎక్కుతూ తన మొక్కును తీర్చుకున్నాడు.. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నితీష్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి నితీష్ తిరుమలకు చేరుకున్నట్టు తెలుస్తుంది.    

ఇటీవలే ఆస్ట్రేలియాలో ముగిసిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టిన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని 10 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో టెస్టుల్లో తన మొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో 37.25 సగటుతో 298 పరుగులు చేసి భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.