టీమిండియా యంగ్ ఆల్ రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి నితీష్ కుమార్ రెడ్డి, అతడి తండ్రి ముత్యాల రెడ్డి గురువారం (జనవరి 16) మర్యాదపూర్వకంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన నితీష్ కుమార్ రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. భవిష్యత్ లోనూ ఇలాగే అత్యుత్తమ ప్రదర్శన చేసి రాష్ట్రానికి, దేశానికి ఇంకా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన రూ.25 లక్షల నగదు ప్రోత్సహాకాన్ని చంద్రబాబు అందజేశారు.
ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫి జరిగిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ తన అద్భుత ప్రదర్శనతో నితీష్ కుమార్ రెడ్డి ఆకట్టుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించి జట్టు ఆపదలో ఉన్న సమయాల్లో ఆదుకున్నాడు. మరీ ముఖ్యంగా మెల్ బోర్న్ వేదికగా ప్రతిష్టాత్మ ఎంసీజీ స్టేడియంలో జరిగిన టెస్ట్‌లో నితీష్ రెడ్డి చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ బ్యాటర్లంతా విఫలమై జట్టు పీకల్లోతూ కష్టాల్లో ఉండగా.. నేనున్నాంటూ నితీష్ టీమిండియాను ఆదుకున్నాడు.
ALSO READ | శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్..
నిప్పులు చెరిగే ఆసీస్ బౌలర్ల బంతులను ఎంతో అనుభవం గల ఆటగాడిలో ఎదుర్కొంటూ జీవితాంతం గుర్తుండిపోయేలా సెంచరీ చేసి భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఈ టెస్ట్‌లో భారత్ ఓటమి పాలైనప్పటికీ.. నితీష్ రెడ్డి పేరు మాత్రం మారుమోగిపోయింది. మెల్ బోర్న్ టెస్ట్ లో అద్భుత ప్రదర్శన చేయడంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నితీష్ కు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని ప్రకటించింది.