SMAT 2024: అంపైర్‌ను కూడా లెక్క చేయలేదు: గ్రౌండ్‌లో గొడవకు దిగిన భారత క్రికెటర్లు

SMAT 2024: అంపైర్‌ను కూడా లెక్క చేయలేదు: గ్రౌండ్‌లో గొడవకు దిగిన భారత క్రికెటర్లు

దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే నాలుగు జట్లు సెమీ ఫైనల్ చేరుకున్నాయి. బరోడా, ముంబై, మధ్య ప్రదేశ్, ఢిల్లీ సెమీస్ చేరుకున్నాయి. ఈ లీగ్ చివరి క్వార్టర్ ఫైనల్ బెంగళూరులో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఇద్దరు భారత టాలెంటెడ్ క్రికెటర్లు గ్రౌండ్ లో గొడవకు దిగారు. ఢిల్లీ ఆటగాడు ఆయుష్ బదోని, ఉత్తర ప్రదేశ్ ఆటగాడు నితీష్ రానా మీదకు దూసుకెళ్లడం వైరల్ గా మారుతుంది. 

అసలేం జరిగిందంటే..?
 
ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్ ఆటగాడు నితీష్ రాణా బౌలింగ్ కు వచ్చాడు. క్రీజ్ లో ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని బ్యాటింగ్ చేస్తున్నాడు. నితీష్ బౌలింగ్ లో షాట్ కొట్టి సింగిల్ తిరిగి బదోని నాన్ స్ట్రైక్ చేరుకున్నాడు. ఈ దశలో ఇద్దరి ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏం జరిగిందో పూర్తి సమాచారం లేకపోయినా అంపైర్ ను కూడా నితీష్ రాణా లెక్క చేయకుండా బదోనీ వైపుగా దూసుకెళ్లాడు. నితీష్ రాణానే ముందుగా గొడవకు దిగినట్లు వీడియోలో కనిపిస్తుంది. అంపైర్‌ జోక్యం చేసుకోవడంతో గొడవ అంతటితో ఆగిపోయింది.

సెమీస్ కు చేరిన ఢిల్లీ:

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఉత్తర ప్రదేశ్ పై ఢిల్లీ 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. వికెట్ కీపర్  అనుజ్ రావత్ 33 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. భారీ లక్ష్య ఛేదనలో ఉత్తర ప్రదేశ్ 19.5 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది.