ఎలక్షన్ తర్వాత నితీశ్ ​పార్టీ మారుతడు.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

ఎలక్షన్ తర్వాత నితీశ్ ​పార్టీ మారుతడు.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

బెట్టియ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ ​కుమార్  ఎన్డీయే కూటమితో కలిసి ఉమ్మడిగానే బరిలోకి దిగుతారు కానీ ఫలితాలు వెలువడ్డాక ఆయన పార్టీ మారుతారని ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ చెప్పారు. మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాలనే ఆశతో కూటమి నుంచి జేడీయూ చీఫ్ నితీశ్ వైదొలుగుతారని జోస్యం చెప్పారు. అయితే, ఏ కూటమిలో చేరినా సరే నితీశ్ ఈసారి సీఎం పదవి చేపట్టడం కష్టమేనని, ఆ స్థాయిలో ప్రజాదరణ కోల్పోయారని చెప్పారు. 

బుధవారం పశ్చిమ చంపారన్ జిల్లాలో ప్రశాంత్​ కిశోర్ ​మీడియాతో మాట్లాడారు. "నవంబర్‌‌‌‌‌‌‌‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత.. నితీశ్ కుమార్ తప్ప ఎవరైనా సీఎం కావొచ్చు. కావాలంటే నేను రాసిస్తాను. ఒకవేళ అది తప్పయితే నా సొంత రాజకీయ ప్రచారాన్ని వదులుకుంటాను" అని కిశోర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీశ్​కుమార్ ఎన్డీయే నుంచి బయటకు వస్తారనే ఊహాగానాలపై స్పందిస్తూ.. ప్రజాదరణ తగ్గుతున్నందున నితీశ్​ను ఎన్డీయే కూటమి తన సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు సంశయిస్తోందని కిశోర్ పేర్కొన్నారు.

 "ఎన్నికల తర్వాత (ఎన్డీయే అధికారంలోకి వస్తే) నితీశ్ కుమార్ పూర్తిగా ఐదేండ్ల పాటు సీఎంగా ఉంటారని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సవాలు చేస్తున్నాను. వారు అలా చేస్తే, బీజేపీ సీట్లు గెలవడం కష్టమవుతుంది" అని కిశోర్ చెప్పారు.