భద్రాచలంలో ఇయ్యాల్టి నుంచి నిత్యకల్యాణాలు

  • రామనామ స్మరణతో మార్మోగిన భద్రాద్రి

భద్రాచలం, వెలుగు: శ్రీమహావిష్ణువు రాముడిగా అవతరించాడు.లక్ష్మీదేవి సీతగా మారింది. శేషుడు లక్ష్మణుడయ్యాడు. ఆ వైకుంఠమే భద్రగిరి ‘కలియుగ వైకుంఠం భద్రాచల నిలయుని సేవింతము’ అంటూ రామదాసు తన కీర్తనలో పేర్కొన్నట్టు.. సోమవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన దక్షిణ అయోధ్యపురి ఇల వైకుంఠపురిని తలపించింది. దట్టంగా కురుస్తున్న మంచు, ఎముకలు కొరికే చలిలో తరలి వచ్చి శేషపాన్పుపై శ్రీమహావిష్ణువు అవతారంలో కొలువుదీరిన రామయ్యను ఉత్తరద్వారాన దర్శించుకుని భక్తులు తరించారు. 

ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, హరిప్రియ, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, కలెక్టర్ అనుదీప్​, ఎస్పీ వినీత్, ఈవో శివాజీ , ఏఎస్పీ రోహిత్​ రాజ్, తహసీల్దార్‍  శ్రీనివాస్‍యాదవ్‍  రఘువంశ సోముడి సేవలో తరించారు. 

ధూపదీపాలు, గుగ్గిలం పొగల మధ్య..

సరిగ్గా 5 గంటల సమయంలో ధూపదీపాలు.. గుగ్గిలం పొగలు, జేగంటలు మారుమోగుతుండగా, జయజయధ్వానాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య వైకుంఠ ఉత్తరద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీరామ తారక నామ అష్టోత్తర పూజలు నిర్వహించారు. మంత్రపుష్పం సమర్పించారు. రుగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, అధర్వణ వేదాలను పఠించారు. 108 ఒత్తులతో స్వామికి నక్షత్ర హారతినిచ్చారు. శరణాగతి దండకం అయ్యాక ఏకాదశి పూట ఉత్తర ద్వార విశిష్టతను వేదపండితులు వివరించారు. 

వైభవోపేతంగా తిరువీధి సేవ..

ఉత్తర ద్వార భక్తులకు దర్శనమిచ్చిన వైకుంఠ రాముడు అనంతరం తిరువీధి సేవకు తరలి వెళ్లారు. చలువ చప్పర వాహనంపై పెరియాళ్వార్‍, నమ్మాళ్వార్‍, మరో వాహనంపై ఆండాళ్లమ్మ వారు, హనుమద్‍వాహనంపై లక్ష్మణస్వామి, గజ వాహనంపై సీతమ్మవారు, గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తికి తిరువీధి సేవ జరిగింది. మేళతాళాలు, కోలాటాలు, రామనామ సంకీర్తనల నడుమ తిరువీధి సేవ శోభాయమానంగా సాగింది. గిరిప్రదక్షిణగా అంబాసత్రం మీదుగా భద్రాద్రి కోవెలకు స్వామివారు చేరుకున్నారు.

సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు గర్భగుడిలో శ్రీసీతారామచంద్రస్వామి మూలవరులకు తొలి అభిషేకం భక్తరామదాసు పేరిట స్థానిక తహసీల్దార్​ శ్రీనివాస్‍యాదవ్‍  నిర్వహించారు. భక్తరామదాసు తహసీల్దారుగా ఉన్న కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ సమయంలో స్వామివారికి తిరుప్పావై గోష్టి, బాలబోగం, తీర్ధప్రసాద వినియోగం చేశారు. అనంతరం స్వామివారిని ఉత్తరద్వారం వద్దకు చేర్చి గరుడ వాహనంపై అధిష్టింపజేశారు. 
అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం నుంచి పగల్‍పత్ ఉత్సవాలు ముగిసి రాపత్‍ఉత్సవాలు ఆరంభమయ్యాయి. రాత్రి వేళల్లో స్వామి పూజలందుకునే ఉత్సవమే రాపత్‍సేవ.  ఏఎస్పీ బంగ్లాలో ఏఎస్పీ రోహిత్​రాజ్​ ఆధ్వర్యంలో పోలీసులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం దర్బారు సేవ తర్వాత స్వామిని ఊరేగింపుగా మేళతాళాల మధ్య తీసుకొచ్చారు. మంగళవారం నుంచి నిత్య కల్యాణాలు తిరిగి ప్రారంభమవుతాయి. 

ఈ ఏడాది పుష్కర పట్టాభిషేకం

ఈ ఏడాది పుష్కర శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్నట్లు స్థానాచార్యులు స్థలసాయి ప్రకటించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రవచనం చేస్తూ ఈ ప్రకటన చేశారు. 2011లో పుష్కర శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించామని, 12 ఏళ్ల తర్వాత శ్రీరామనవమి తర్వాతి రోజు ఈ పట్టాభిషేకం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.