Nivetha Pethuraj: రూ.50 కోట్ల విలువైన గిఫ్ట్..రూమర్స్పై నివేదా సీరియస్!

Nivetha Pethuraj: రూ.50 కోట్ల విలువైన గిఫ్ట్..రూమర్స్పై నివేదా సీరియస్!

టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్(Nivetha Pethuraj) సినిమాలతో పాటు బ్యాడ్మింటన్ గేమ్లో కూడా రాణిస్తోంది. ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.తెలుగులో శ్రీ విష్ణు తో హీరోగా తెరకెక్కిన మెంటల్ మదిలో చిత్రంతో అరంగ్రేట్రం చేసిన ఈ బ్యూటీ బ్రోచేవారెవరురా, రెడ్, పాగల్, అలవైకుంఠపురంలో, చిత్రలహరి  దాస్ కా ధమ్కీ వంటి మూవీస్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 

లేటెస్ట్గా నివేదా పేతురాజ్ గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వస్తుండటంతో అసహనం వ్యక్తం చేసింది. ఆమెపై కొందరు పెద్ద వ్యక్తులు డబ్బు ఖర్చుపెడుతున్నారని, దుబాయ్‌లో అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతోందని కోలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాకుండా తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ ఆమెకు 50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చారని కూడా రూమర్స్ క్రియేట్ కావడంతో ట్విట్టర్ 'ఎక్స్'లో ఘాటుగా స్పందించింది. 

"నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నేను వీటిపై మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి తప్పుడు వార్తలు రాసేవాళ్ళు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేముందు..ఆ సమాచారం నిజమా కాదా అని తెలుసుకునే మానవత్వం కలిగి ఉంటారని నేను భావించాను. ఈ వార్తలతో నేను, నా ఫ్యామిలీ గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒకసారి కొంచెమైనా ఆలోచించండి. 

నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నేను 16 సంవత్సరాల నుండే స్వతంత్రంగా సంపాదించడం మొదలుపెట్టాను. ఆర్థికంగా స్థిరంగా ఉన్నాను. నా ఫ్యామిలీ ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉంటుంది. 20 ఏళ్లకు పైగా మేము దుబాయ్‌లోనే ఉంటున్నాం. సినిమా ఇండస్ట్రీలో నాకు అవకాశాలు ఇప్పించమని ఏ రోజూ నేను నిర్మాతను గానీ, డైరెక్టర్ని, హీరోని గానీ ఎప్పుడూ అడగలేదు. నేను 20కి పైగా సినిమాలు చేశాను. అవన్నీ నా దగ్గరికి వచ్చిన అవకాశాలే. నేను ఎప్పుడూ వర్క్ కోసం, డబ్బు కోసం అత్యాశ పడను. 

నా గురించి ఇప్పటి వరకూ వచ్చిన వార్తలు అన్ని అబద్దాలే అని నేను ధృవీకరించగలను. మేము 2002 నుండీ దుబాయ్‌లో అద్దె ఇంట్లోనే ఉంటున్నాము. అలాగే, 2013 నుండి రేసింగ్ అంటే నాకు ఫ్యాషన్. నిజానికి చెన్నైలో రేసులను నిర్వహించడం గురించి నాకు తెలియదు. నేను చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నాను. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాతే నేను ఇప్పుడు మెంటల్ గా, ఎమోషనల్ గా మంచి స్థానంలో ఉన్నాను. మీ కుటుంబంలోని ఆడవాళ్లు కోరుకున్నట్టే నేను కూడా గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను.

ALSO READ :- గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్లకు 3 వేల కోట్లు రిలీజ్

జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉందని, ఇకపై వారు ఇలా పరువుకు భంగం కలిగించరని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను కాబట్టే, నేను దీనిపై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కుటుంబాల ప్రతిష్టని నాశనం చేసేముందు, మీకు అందిన సమాచారం నిజమో కాదో ధృవీకరించుకోవాలని కోరుతున్నాను. మా కుటుంబాన్ని ఇకపై ఎలాంటి బాధలకు గురిచేయవద్దని నేను జర్నలిస్టులను అభ్యర్థిస్తున్నాను. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజాన్ని నమ్మండి" అంటూ నివేధా పేతురాజ్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.