35 Chinna Katha Kaadu Review: 35 చిన్న కథ కాదు రివ్యూ.. పిల్లలు,పేరెంట్స్ చూడాల్సిన సినిమా

బ్యూటిఫుల్ హీరోయిన్ నివేదా థామస్ (Nivetha Thomas) చాలా గ్యాప్ తర్వాత నటించిన తెలుగు సినిమా 35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu). విశ్వ‌దేవ్‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు ప్రముఖ పాత్రలు పోషించిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణసంస్థలు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి సంయుక్తంగా నిర్మించారు. నేడు శుక్రవారం (సెప్టెంబర్ 6న) థియేటర్లలో విడుదల అయిన అచ్చమైన తెలుగు సినిమా పై భారీ అంచనాలున్నాయి. అంతేకాకుండా పిల్లల చదువుకు సంబంధించిన కథతో ఒక మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాని ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

Also Read:-అక్కినేని నట వారసుడిది పదిహేనేళ్ల ప్రయాణం

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ (U)సర్టిఫికెట్ జారీ చేసింది.

క‌థేంటంటే: 

తిరుపతిలో ప్రసాద్(విశ్వదేవ్) ఒక ఆర్టీసీ కండక్టర్.వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ప్రసాద్ తన సొంత మరదలు అయిన 'చిన్ను' స‌ర‌స్వ‌తి (నివేదా థామస్)ని పెళ్లి చేసుకుని అరుణ్, వరుణ్ అనే ఇద్దరు పిల్లలకు తండ్రి అవుతాడు. ఈ ముగ్గురే ప్రపంచంగా బతుకుతుంటారు. చిన్నోడు చదువులో ప‌ర్వాలేదు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం లెక్క‌ల పాఠాలు ఓ ప‌ట్టాన అర్థం కావు. అంతేకాకుండా అరుణ్ కి చిన్నప్పట్నుంచి లెక్కల్లో బోలెడు డౌట్స్ ఉంటాయి. అసలు సున్నా గురించి ఇంకా చాలా డౌట్స్. అతని డౌట్స్ ఎవరూ తీర్చకపోవడంతో లెక్కల సబ్జెక్టు అంటేనే నచ్చదు. సున్నాకి ఏమీ విలువ లేన‌ప్పుడు దానిప‌క్క‌న ఒక‌టి వ‌చ్చి నిల‌బ‌డితే ప‌ది ఎందుకవుతుంద‌ంటూ ఫండమెంటల్స్‌నే ప్రశ్నిస్తాడు. కొత్తగా వచ్చిన గణితం మాస్టారు చాణక్య(ప్రియదర్శి)తో పాటు ఏ ఉపాధ్యాయుడు తన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకకోవడంతో సున్నా మార్కులు తెచ్చుకుంటాడు. దీంతో అరుణ్‌కి జీరో అని పేరు పెట్టి చివ‌రి బెంచీకి పంపిస్తాడు. ఆరోత‌ర‌గ‌తిలో ఫెయిల్ కూడా చేస్తాడు. దీంతో త‌న త‌మ్ముడి క్లాస్‌లో కూర్చోవాల్సి వ‌స్తుంది. ఈసారి అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే లెక్క‌ల్లో క‌నీసం 35 మార్కులు సాధించాల్సిందే. ఆ ప‌రిస్థితుల్లో జీరో అరుణ్.. క్లాస్‌లో హీరో ఎలా అయ్యాడు? త‌న కొడుక్కి లెక్క‌ల పాఠాలు అర్థం కావాల‌ని టెన్త్ ఫెయిల్ అయిన త‌ల్లి స‌ర‌స్వతి ఏం చేసింది?  చాణక్య రాకతో అరుణ్ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? అరుణ్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అరుణ్‌ను స్కూల్ నుంచి ఎందుకు సస్పెండ్ చేస్తారు? అరుణ్‌కు లెక్కల్లో ఉండే ఆ ప్రశ్నలు, అనుమానాల్ని తల్లి ఎలా నివృత్తి చేసి కనీసం 35 మార్కులు తెచ్చుకునేలా ఎలా ప్రిపేర్ చేయించింది? అనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే:

ఇది లెక్క‌ల క‌థ‌, పిల్ల‌ల క‌థ మాత్ర‌మే కాదు..అమ్మానాన్న‌ల క‌థ కూడా. మ్యాథ్స్ అనేది చిన్న పార్ట్ మాత్రమే. ఇందులో చాలా మాస్ మూమెంట్స్ క్లాస్ రూమ్ నుంచే వస్తాయి. చాలా నోస్టాల్జియా మూమెంట్స్ ఉంటాయి. భార్యా, భర్త, పిల్లలు, టీచర్ స్టూడెంట్స్ ఇలాంటి బ్యూటీఫుల్ రిలేషన్షిప్స్ గురించి చాలా అందంగా చెప్పడం జరిగింది. ఇది కళాతపస్వీ కె విశ్వనాథ్ గారి సినిమాలు చూసిన ఫీలింగ్ ఇస్తుంది. నిజానికి మనలో చాలామంది చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే భయపడే ఉంటారు. ఆ తర్వాత కాలంలో దాన్ని అధిగమించి ఉంటారు. దాన్ని తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. 

చెప్పాలంటే..ఇది చిన్న కథ కాదు. చాలా పెద్ద కథ. ఇందులో పిల్లలతో పాటు తల్లిదండ్రులు, సమాజం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను చర్చించారు. ప్రస్తుతం విద్యా విధానం ఎలా సాగుతుంది? ఎలా సాగితే పిల్లలకు ఉపయోగం అని తెలియజేసే చిత్రమిది. 

ఫస్టాఫ్ విషయానికి వస్తే..భార్యాభ‌ర్త‌లు ఒక‌రినొక‌రు ఎలా అర్థం చేసుకోవాలో..ప్ర‌సాద్‌, స‌ర‌స్వ‌తిల మ‌ధ్య సాగే స‌న్నివేశాల‌తో ఎంతో అందంగా చూపించారు. భ‌ర్త మ‌న‌సుని గెలిస్తే చాల‌నుకొని టెన్త్ ఫెయిల్‌తోనే ఆగిపోయిన ఓ గృహిణి...ఏ ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ పుస్త‌కాలు ప‌ట్టాల్సి వ‌చ్చింద‌నేది ఇందులో కీల‌కంగా చూపించారు.స్కూల్‌ నేపథ్యంలో సాగే సీన్స్‌ మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్‌ సీన్‌ ఎమోషనల్‌ టచ్‌ ఇస్తుంది

సెకండాఫ్ విషయానికి వస్తే..ఇలా ఇంట్లో పనులు చేస్తూ ఓ గృహిణిగా భర్త కోసం తాపత్రయపడే భార్యగా పిల్లల భవిష్యత్తుకు ఆరాటపడే తల్లిగా.. ఇలా అన్ని కోణాల్లో నివేతా థామస్ తనలోని నటనను అద్భుతంగా చూపించింది. ముఖ్యంగా సెకండాఫ్ లో తనపై వచ్చే ప్రతి సీన్ బాగుంది. తన కొడుకుతో సంఖ్య ’10’ కోసం చెప్పే డైలాగ్ అయితే సినిమాలో వావ్ అనిపించేలా ఎగ్జైట్ చేస్తుంది అని చెప్పాలి. మాథ్స్ అనే ఒక పెనుభూతం ఎంటర్ అయితే ఆ పెనుభూతాన్ని తన తల్లి సహాయంతో ఒక కుర్రవాడు ఎలా ఎదిరించాడు అనే విషయాన్ని చాలా హృద్యంగా తెరమీద ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్.చాలా ప్ర‌శ్న‌ల‌తో క‌థ‌ని మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు, సెకండాఫ్ లో అమ్మ పాత్ర నుంచి వాటికి స‌మాధానాల్ని చెప్పించిన విధానం సినిమాకి హైలైట్‌. పిల్ల‌ల‌కు పాఠాలు ఎలా చెబితే బోధ‌ప‌డ‌తాయో ఆ స‌న్నివేశాలు చాటి చెబుతాయి. ప‌తాక స‌న్నివేశాల్లో తండ్రి మార్కులు చ‌దివిన‌ప్పుడు అరుణ్ అద్దంపై నీళ్లు చ‌ల్లే స‌న్నివేశాలు భావోద్వేగాల్ని పంచుతాయి. అయితే కథనం నెమ్మదిగా సాగడం..కాస్తా డిస్సపాయింట్ కలిగిస్తోంది అంతే తప్ప..సినిమా చాలా బాగుంది. కామెడీ కూడా పిల్లలతో బాగానే చేయించి నవ్వించారు. అదే పిల్లలతో ఎమోషన్ కూడా పండించి మెప్పించారు. మొదటి బడి తల్లి ఒడే అంటూ తల్లి ఎమోషన్ ని బాగా పండించారు. 

ఎవ‌రెలా చేశారంటే: 

నాని జెంటిల్‌మెన్, నిన్ను కోరి చిత్రాలతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న నివేదా థామస్ మొదటిసారిగా తల్లి పాత్రలో నటించింది అనే దాన్ని కంటే సరస్వతి పాత్రలో జీవించింది అనడం చాలా ఉత్తమం. సెకండాఫ్‌లో ఆమె నటన హైలెట్‌. కళ్లతోనే భావాన్ని పలికించింది. ఎమెషనల్‌ సీన్లలో అద్భుతంగా నటించింది.ఇందులో మ్యాథ్స్ టీచర్ చాణక్య క్యారెక్టర్ ప్లే చేశారు దర్శి. చాణక్య లాంటి టీచర్స్‌ని మన జీవితంలో చూసే ఉంటాం. అంతలా నటించారు దర్శి. విశ్వ‌దేవ్ భ‌ర్తగా, తండ్రిగా చాలా బాగా న‌టించాడు. భాగ్యరాజ్‌, కృష్ణ‌తేజ త‌దిత‌రులు కీల‌క‌మైన పాత్ర‌ల్లో కనిపిస్తారు. చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ లెక్కలు అర్ధం కాక, తనని ఎవరు పట్టించుకోక సతమతం అయ్యే పాత్రలో మంచి ఎమోషన్ పండించాడు. కొన్ని సీన్స్ లో అరుణ్ ని చూస్తే మనం ఏడ్వాల్సిందే. TTD పర్సన్ గా, గౌతమి, ప్రినిసిపాల్ గా భాగ్యరాజా తమ పాత్రలకు న్యాయం చేశారు. 

సాంకేతిక అంశాలు:

సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో విజువల్స్ అందంగా చూపించారు. ద‌ర్శ‌కుడు నందకిషోర్‌ ఇమాని ప‌నిత‌నం మెప్పిస్తుంది. ఓ కొత్త కోణాన్ని స్పృశించిన తీరు, క‌థ‌ని న‌డిపించిన విధానం ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. ఎన్నున్నా స‌రే, ఓడిపోతామ‌నే భయం ఉంటే ఏమీ లేకుండా చేస్తుంది, గెలుపు అనే ప్ల‌స్ వైపు అడుగులు వేస్తున్న ప్ర‌తిఒక్కరికీ ఎదుర‌య్యే ఓ మ‌జిలీ జీరో, ఎద‌గాల‌నుకున్న‌ప్పుడు తుంచాలి కొమ్మనైనా, కొడుకునైనా..త‌దిత‌ర సంభాష‌ణ‌లు సినిమాకి బ‌లాన్నిచ్చాయి. ఇక పాటలు ఫర్వాలేదు, నేపథ్య సంగీతం సినిమా స్థాయికి తగ్గట్టుగా సెట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. లొకేషన్స్ పరంగా తిరుమల, తిరుపతిలోని చాలా లొకేషన్స్ ని రియల్గా చూపించారు.మొత్తానికి 35 చిన్న కథ కాదు..ఇది మంచి కథ..గొప్ప కథ..ఎందుకంటే ఇది ప్రతిఒక్కరి కథ.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ (U)సర్టిఫికెట్ జారీ చేసింది.

'U' సర్టిఫికేట్: అనియంత్రిత పబ్లిక్ ఎగ్జిబిషన్ అంటే ఎవరైనా దీన్ని చూడవచ్చు. సినిమా కథ, సన్నివేశాలు కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉంటాయని అర్థం. హింస లేదా నగ్నత్వ సన్నివేశాలు ఉండవనమాట. 

  • Beta
Beta feature