హీరోయిన్ అంటే గ్లామర్ ఉండి తీరాలి అనే మాటను తోసిపుచ్చుతూ.. పర్‌ఫార్మెన్స్ బాగుంటే అవకాశాలు వాటంతటవే వస్తాయని ప్రూవ్ చేసింది నివేదా థామస్. జెంటిల్‌మేన్, నిన్ను కోరి, బ్రోచేవారెవరురా వంటి మంచి సినిమాలను తన అకౌంట్‌లో వేసుకుంది. పాత్ర ఏదైనా అదరగొడుతుందనే పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన ‘వి’ సెప్టెంబర్ 5 న ఓటీటీలో రిలీజ్ కానున్న సందర్భంగా కాసేపు ఇలా ముచ్చటించింది.
‘వి’ అంటే ఏంటని చాలామంది అడుగుతున్నారు. ‘వి’ అంటే విక్టరీ కూడా అనుకోవచ్చు. నిజానికి ఈ సినిమాతో మా ఎంటైర్ టీమ్‌కీ విక్టరీ దక్కుతుందని అనుకుంటున్నాం. అయితే ‘వి’ వెనుకున్న అసలు సీక్రెట్ తెలియాలంటే మాత్రం సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాకిది రెండో సినిమా. నానితో మూడో మూవీ. వాళ్దిద్దరితో కలిసి పని చేయడం చాలా కన్వీనియెంట్‌గాను, ఆనందంగాను ఉంటుంది. టాలీవుడ్ నంబర్ వన్ ప్రొడ్యూసర్స్‌లో దిల్ రాజు ఒకరు. ఆయన బ్యానర్‌లో పని చేయడం కూల్‌గా అనిపిస్తుంది.
ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంటే హీరోలు, హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటారు. కానీ ‘వి’ విషయం కాస్త డిఫరెంట్. ఎందుకంటే ఈ మూవీలో హీరో అంటూ ఎవరూ లేరు. పాత్రలు మాత్రమే ఉంటాయి. ఏ పాత్ర ఇంపార్టెన్స్ ఆ పాత్రకి ఉంటుంది.
నాని విలన్ రోల్‌లో కనిపిస్తారా అనేది అందరికీ ఉన్న పెద్ద డౌట్. దాని గురించి నేనిప్పుడే చెప్పకూడదు. నిజానికి ఈ సినిమాలోని పాత్రలన్నీ హిందీ సినిమా ‘ధూమ్’ తరహాలో ఉంటాయి. నాని తన ఇమేజ్‌కి భిన్నంగా చేశారిందులో. తన కెరీర్‌లోనే ఇది బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని టీమ్ అంతా అనుకుంటున్నాం. నాని యాక‌్టర్‌గా ఓ పాత్రను ఒప్పుకున్నారంటే దాన్ని తెరపైకి ఇంకా గొప్పగా తీసుకు రావడానికి ట్రై చేస్తారు. తను చాలా విషయాల్లోనాకు ఇన్‌స్పిరేషన్.
నేను అపూర్వ అనే క్రైమ్ నవలా రచయిత్రిగా కనిపిస్తాను. కథ వినగానే బాగా కనెక్టయ్యాను. నా పాత్ర ఎంత ఒబీడియెంట్‌గా ఉంటుందో అంతే ధైర్యంగా, కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. అదితీరావ్ హైదరీ, సుధీర్ బాబుల పాత్రలు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. హైలైట్ అవుతాయి.
థియేటర్స్‌లో విడుదల చేయాలనే ఎంటైర్ యూనిట్ కష్టపడ్డారు. అయితే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కుదరలేదు. అమెజాన్‌లో విడుదల చేస్తున్నాం. నిజానికి ఈ సినిమాని తెరపై చూస్తే వచ్చే ఫీలింగే వేరు. అలాగే ఓ ఆర్టిస్ట్ కి తన సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసుకోవాలనే ఉంటుంది. ‘వి’ని అలాగే చూడాలనుకున్నాం. కానీ తప్పట్లేదు. ఇంతమంది స్టార్స్‌తో ఓటీటీలో వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే అంటున్నారు. అందుకే రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.
ఆ స్క్రిప్స్ ట్ వినాలి, ఈ స్క్రిప్ట్ వినకూడదు అనేదేమి ఉండదు నాకు. నా దగ్గరకు వచ్చే అన్ని కథలూ వింటాను. నేనా పాత్రకి న్యాయం చేయగలుగుతానా లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. తక్కువ సినిమాలు చేసినా బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటాను. గుర్తింపునిచ్చే ఏ పాత్ర చేయడానికైనా నేను రెడీ. ముఖ్యంగా నెగిటివ్ రోల్ చేయాలని ఎప్పట్నుంచో ఉంది. అవకాశం కోసం చూస్తున్నాను.
డైరెక్టర్ కావాలనేది నా డ్రీమ్. అయితే నన్నెవరూ పిలిచి డైరెక్షన్ చాన్స్ ఇచ్చేయరు. నేనే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లాలి. దానికింకా టైముంది. ప్రస్తుతానికి నేను నటినే. మెల్లగా అటువైపు అడుగులేస్తాను. ఒకేసారి సినిమా చేసేయను. మొదట షార్ ఫిట్ ల్మ్స్ చేస్తాను. మెల్లగా సినిమా డైరెక్ట్ చేస్తాను.
కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులు అందరి జీవితాల పైన ప్రభావం చూపాయి. సినీ ఇండస్ట్రీ అనే కాదు.. దాదాపు అన్ని రంగాల వారినీ సమస్యల్లోకి నెట్టిందీ వైరస్. ఇలాంటి పరిస్థితుల్లో నేను నా వంతుగా ఇండస్ట్రీకి, నిర్మాతలకు సహాయ పడేందుకు సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే నా రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాను.
నేను ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటాను. పుస్తకాలు చదువుతుంటాను. ఏదైనా సాఫ్ట్‌వేర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. లాక్‌డౌన్ టైమ్‌లో మాత్రం ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేశాను. మూడు తెలుగు కథలు కూడా విన్నాను.
అవన్నీ డెవలప్‌మెంట్ దశలో ఉన్నాయి. వివరాలు త్వరలో చెప్తాను. చాలామంది ఓటీటీల్లో నటిస్తున్నారు. నన్ను ఇంతవరకు ఎవరూ అడగలేదు. అవకాశం వస్తే అప్పుడు ఆలోచిస్తాను.
స్టార్‌డమ్ అనే మాటనే నేనసలు పట్టించుకోను. ఇప్పుడు నేనున్న స్థాయిని నేను బాగానే ఎంజాయ్ చేస్తున్నాను. ఓ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలనుకుంటానే తప్ప దేని కోసమో ఆరాటపడను. అలాగే ఈమధ్య కాలంలో చాలామంది నెపోటిజం గురించి అడుగుతున్నారు. దానివల్ల నాకెప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదు. కాబట్టి దాని గురించి నాకంతగా తెలియదు.
For More News..