రోడ్డెక్కిన నిజాం కాలేజీ స్టూడెంట్లు

రోడ్డెక్కిన నిజాం కాలేజీ స్టూడెంట్లు
  •     యూజీ స్టూడెంట్లకే హాస్టల్ కేటాయించాలని డిమాండ్
  •     తీవ్ర ట్రాఫిక్ జామ్.. 101 మంది స్టూడెంట్లు అరెస్ట్

బషీర్ బాగ్, వెలుగు: హాస్టల్​లో అడ్మిషన్ల కోసం నిజాం కాలేజీ యూజీ స్టూడెంట్లు రోడ్డెక్కారు. సోమవారం బషీర్ బాగ్ చౌరస్తాలో బైఠాయించి ఆందోళనకు దిగారు. కాలేజీ ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2022లో యూజీ స్టూడెంట్ల కోసం గర్ల్స్ హాస్టల్ నిర్మించారని చెప్పారు. ఆ ఏడాది హాస్టల్ లో యూజీ స్టూడెంట్ల అడ్మిషన్లు తక్కువగా జరగడంతో పీజీ స్టూడెంట్లకు కూడా హాస్టల్​కేటాయించారని తెలిపారు. అయితే ఈ ఏడాది యూజీ స్టూడెంట్ల అడ్మిషన్లు ఎక్కువ వచ్చాయని, చాలా మందికి కాలేజీ హాస్టల్​లో అడ్మిషన్ దొరకట్లేదని వాపోయారు. 

ప్రిన్సిపాల్ స్పందించి యూజీ స్టూడెంట్లకు మాత్రమే హాస్టల్​కేటాయిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్​చేశారు. లేకుంటే ఇక్కడి నుంచి కదలబోమని తేల్చిచెప్పారు. అప్పటికే స్టూడెంట్ల ఆందోళనతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్​స్తంభించింది. రంగంలోకి దిగిన అబిడ్స్ పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో 101 మంది స్టూడెంట్లను అరెస్ట్ చేసి, ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. స్టూడెంట్లపై ప్రివెంటివ్ అరెస్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు అబిడ్స్ పోలీసులు తెలిపారు. అంతకు ముందు కాలేజీ క్యాంపస్​లో స్టూడెంట్లు ఆందోళన చేశారు.