- ఎనిమిదేండ్లుగా ‘సహకారం’ ముచ్చటే...
- ఎన్నికల అస్త్రంగా నిజాం దక్కన్ షుగర్స్
- ప్రభుత్వమే నడపాలంటున్న రైతులు
- రైతులే నిర్వహించుకోవాలని సర్కారు పట్టు
- ‘నిజామాబాద్ షుగర్స్’ ను నడిపించుకుంటామన్నా వినట్లే !
- ఇథనాల్ ఉత్పత్తి చేస్తామంటున్నా డోంట్‌కేర్
- ఒక్కోచోట సర్కారుది ఒక్కో తీరు
‘నిజాం షుగర్స్ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం.. పెట్టుబడి నిధిగా రూ.250 కోట్లు ఇస్తాం.. మహారాష్ట్ర మాదిరి సహకార రంగంలో నిర్వహణ చేపట్టడానికి రైతులు ముందుకు వస్తే అప్పగిస్తాం’ ఈ నెల 11న తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్
నిజామాబాద్, వెలుగు: ఆసియా ఖండంలో అతిపెద్ద చెక్కర ఫ్యాక్టరీగా పేరుపొందిన నిజాం దక్కన్ షుగర్స్ పునరుద్ధరణ అంశం రూలింగ్ పార్టీకి ఎన్నికల అస్త్రంగా మారింది. ఫ్యాక్టరీ మూతపడి సుమారు ఎనిమిదేండ్లవుతున్నా పున:ప్రారంభానికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోని రాష్ట్ర సర్కారు, ఎన్నికల ఏడాది కావడంతో మరోసారి ఈ అంశం ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది. నిజాం షుగర్స్ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని, మహారాష్ట్ర మాదిరి సహకార రంగంలో నిర్వహణ చేపట్టడానికి రైతులు ముందుకు వస్తే, తమ వంతుగా రూ.250 కోట్లు ఫండ్స్ ఇస్తామని ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజాం షుగర్స్‌ను సహకార రంగంలో నిర్వహించడం అంటే తమ చేతులు తమ నెత్తి మీద పెట్టడమేనని, అలా కాకుండా ప్రభుత్వమే నడపాలని రైతులు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. అదే సమయంలో నిజామాబాద్సహకార చక్కెర పరిశ్రమ (ఎన్సీఎస్ఎఫ్)ను తాము నడుపుకుంటామని రైతులు 2008 నుంచి అడుగుతున్నా వాళ్లకు పర్మిషన్ ఇవ్వడం లేదు.
ఆసక్తి లేకున్నా ఒత్తిడి
నిజాం దక్కన్ షుగర్స్‌లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఉంది. 51 శాతం వాటాతో నిర్వహిస్తున్న ప్రైవేటు యాజమాన్యం 2015 డిసెంబర్23న అనూహ్య రీతిలో లేఆఫ్ ప్రకటించింది. 49 శాతం వాటా ఉన్న సర్కారు ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. కార్మికులు, చెరుకు రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో సహకార రంగం పేరుతో మెలికపెట్టారు. మూలధనంగా రూ.250 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని..నిర్వహణను రైతులే చేపట్టాలని సూచించారు. ఇందుకోసం పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో అక్కడి రైతులు సహకార రంగంగా ఏర్పడి నడుపుతున్న ఫ్యాక్టరీలను చూపించడానికి తీసుకెళ్లారు. అయితే నిర్వహణ బాధ్యతలపై రైతులకు కొంచం కూడా ఆసక్తి లేదు. ప్రభుత్వంతో కాని నిర్వహణ.. తమతో ఎలా అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. అనేక సందర్భాల్లో నిజాం షుగర్స్ నిర్వహణ తమతో కాదని చెబుతూ వచ్చిన పాలకులు.. ఇప్పడు కొత్తగా బంతిని మళ్లీ రైతుల కోర్టులోకి నెట్టారు.
చారిత్రక సంపదన్నరు..మూతేసిన్రు...
1938లో బోధన్‌లో స్థాపించిన నిజాం షుగర్స్ ఫస్ట్యూనిట్ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద సంస్థగా ఎదిగింది. మెదక్, మెట్పల్లి, మిర్యాలగూడ, జహీరాబాద్, ఛాగళ్లు, హిందూపురం, బొబ్బిలి సీతారామనగర్లో యూనిట్లు పెట్టే స్థాయికి ఎదిగింది. నాగార్జునసాగర్‌లో సొంతగా మిషనరీ డివిజన్, సోడా గ్యాస్ ప్లాంటు, ఇథనాల్ ఉత్పత్తితో మరింతగా విస్తరించింది. రైతులపై ఆధారపడకుండా ఫ్యాక్టరీ ముడిసరుకైన చెరుకు కోసం శక్కర్‌నగర్ చుట్టూ 35 కిలోమీటర్ల పరిధిలో 16 వేల ఎకరాల వ్యవసాయ భూమిని సంపాదించుకుంది. అయితే, 1996 నుంచి యాజమాన్యం వ్యవసాయ భూములు అమ్మడం మొదలుపెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సరికే బోధన్, మెట్పల్లి, మెదక్ మిల్లులు మినహా ఇతర ఫ్యాక్టరీలను అమ్మేశారు. మిగిలిన మిల్లులను తెలంగాణ రాష్ట్ర చారిత్రక సంపదగా పేర్కొన్న సీఎం కేసీఆర్..వాటిని కాపాడతామని ప్రకటన చేశారు. కానీ, ఆయన హయాంలో అవి కూడా మూతబడ్డాయి.
నిజామాబాద్ షుగర్స్‌పై మరోలా..
సహకార రంగంలో రైతులు నిజాం దక్కన్ షుగర్స్నడుపుకోవాలని, దాని కోసం ఫండ్స్ఇస్తామని చెబుతున్న సర్కారు నిజామాబాద్ సహకార చక్కెర పరిశ్రమ విషయానికి వచ్చే సరికి చప్పుడు చేయడం లేదు. రైతులంతా కలిసి తాము సహకార పద్ధతిలో నడుపుకుంటామంటున్నా ఖాతరు చేయడం లేదు. 1962లో రూ.2.35 కోట్ల రైతుల షేర్ క్యాపిటల్‌తో నిజామాబాద్ షుగర్స్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఏడు వందల మంది వరకు ఉపాధి పొందేవారు. ఎంతోమంది చెరుకు రైతులకు బతుకుదెరువునిచ్చింది. అయితే, వివిధ కారణాలు చెబుతూ పాలకులు 2008లోనే దీనిని మూసేశారు. ఈ ఫ్యాక్టరీకి సుమారు రూ.300 కోట్ల విలువైన 90 ఎకరాల భూమి ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు తాము సహకార పద్ధతిలో ఫ్యాక్టరీ నడుపుకుంటామని, కానీ, చక్కెరకు బదులు ఇథనాల్ ఉత్పత్తి చేస్తామని చెబుతున్నా చెవికెక్కించుకోవడం లేదు. తమకు నిర్వహణను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
కోర్టుకు పోతం
నిజామాబాద్ రూరల్, వెలుగు: నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీని రైతులకు అప్పగించాలని, లేదంటే కలెక్టర్‌సహా సంబంధిత అధికారులపై కోర్టులో కేసు వేస్తామని ఇందూరు పరస్పర సహకార పరపతి చక్కెర సంఘం చైర్మన్ కొండల్ సాయిరెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఫ్యాక్టరీ ఆవరణలో సంఘం కార్య వర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నష్టాల సాకుతో మూసివేసిన ఈ ఫ్యాక్టరీని నడపడం చేతకాకపోతే రైతులకు అప్పగించాలని కోరారు. అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు ఎన్నోమార్లు విన్నవించామని..అయినా స్పందన లేదని మండిపడ్డారు. ఫ్యాక్టరీలోని వాటాదారులుగా స్వచ్ఛందంగా కొత్త పాలకమండలిని సైతం ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్, డీసీవో దృష్టికి తీసుకెళ్లగా పది రోజుల సమయం అడిగారని చెప్పారు. 15రోజులు గడుస్తున్నా స్పందన రాకపోవడంతో కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు , డైరెక్టర్లు పాల్గొన్నారు.