తెలంగాణ లో నిజాం షుగర్స్ గేట్లు త్వరలో ఓపెన్!

తెలంగాణ లో నిజాం షుగర్స్ గేట్లు త్వరలో ఓపెన్!
  • తెరుచుకోనున్న బోధన్, ముత్యంపేట ఫ్యాక్టరీలు
  • వన్​టైమ్ సెటిల్​మెంట్ కింద పాత బకాయిల చెల్లింపుకు బ్యాంకర్లు ఓకే 
  • రూ.43 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం 
  • పరిశ్రమల పునరుద్ధరణకు జనవరిలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు 
  • చర్చలతో బ్యాంకులు, ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలు త్వరలోనే ఓపెన్ కానున్నాయి. చక్కెర ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలను వన్ టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వన్​టైమ్ సెటిల్మెంట్ కు బ్యాంకర్లు ఒప్పుకోవడంతో పాత బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అందుకు సంబంధించి రూ.43 కోట్లు విడుదల చేసింది. అధికారంలోకి రాగానే మూతపడ్డ చక్కెర పరిశ్రమలను తెరిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు.

 మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో జనవరిలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు, ఆర్థిక ఇబ్బందులపై ఈ కమిటీ పలు దఫాలుగా చర్చలు జరిపింది. బకాయిల చెల్లింపునకు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద అవకాశం ఇవ్వాలని బ్యాంకర్లను కోరింది. 

అందుకు బ్యాంకర్లు ఒప్పుకోవడం, వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.43 కోట్ల బకాయిలను విడుదల చేయడంతో మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలు తెరిచేందుకు మార్గం సుగమమైంది. కాగా, సెప్టెంబర్ 17లోపు చక్కెర పరిశ్రమలను పునరుద్ధరిస్తామని ఇటీవల రైతులకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

ఇట్ల మూతపడ్డయ్.. 

నిజాం హయాంలో నిజామాబాద్‌‌‌‌ జిల్లా బోధన్‌‌‌‌ లో 1938లో చక్కెర కర్మాగారం ప్రారంభించారు. పరిశ్రమకు కావాల్సిన చెరుకు ఉత్పత్తి కోసం 16వేల ఎకరాల భూమిని సేకరించారు. అప్పట్లో ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా బోధన్‌‌‌‌ లోని నిజాం షుగర్స్‌‌‌‌ ఫ్యాక్టరీ పేరొందింది. ఈ పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు ఉపాధి పొందాయి. బోధన్‌‌‌‌లో ప్రధాన యూనిట్‌‌‌‌తో మొదలైన ఈ పరిశ్రమ ఉమ్మడి రాష్ట్రంలో మెదక్, నల్గొండ, అనంతపురం జిల్లాలను కలుపుకొని 7 యూనిట్లుగా విస్తరించింది.

 బోధన్‌‌‌‌తో పాటు జగిత్యాల జిల్లా ముత్యంపేట, మెదక్ జిల్లా మొంబోజీపేటలోని ఫ్యాక్టరీలు మినహా మిగతావి ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతానికి బోధన్, ముత్యంపేట, మొంబోజీపేట యూనిట్లు 51% ప్రైవేట్, 49 % ప్రభుత్వ వాటా కలిగి ఉన్నాయి. చక్కెర పరిశ్రమల రాకతో ఆయా ప్రాంతాల్లో ఉపాధితో పాటు విద్య, వైద్య సౌకర్యాలు సైతం స్థానికులకు అందుబాటులోకి వచ్చాయి. బోధన్‌‌‌‌ షుగర్స్‌‌‌‌ పరిశ్రమ పరిధిలో వేలాది ఎకరాల్లో చెరుకు పంట సాగైంది. బోధన్‌‌‌‌, కోటగిరి, వర్ని, ఎడపల్లి, రెంజల్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌ రూరల్‌‌‌‌తో పాటు ఇతర మండలాల్లోనూ చెరుకు పండించారు. 

పరిశ్రమ నడిచిన రోజుల్లో 40 వేల ఎకరాల్లో చెరుకును అక్కడి రైతులు సాగు చేసేవారు. క్రమంగా చెరుకు సాగు విస్తీర్ణం తగ్గడం, చక్కెర ఉత్పత్తి వ్యయం పెరగడంతో కర్మాగారాలు నష్టాల్లోకి వెళ్లాయి. అంతర్జాతీయ ఒడిదొడుకులు ఓ కారణమైతే, ప్రభుత్వ విధానాలు కూడా పరిశ్రమలు నష్టాల బాట పట్టడానికి కారణమయ్యాయన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఘనకీర్తి కలిగిన బోధన్‌‌‌‌ నిజాం షుగర్స్‌‌‌‌ పరిశ్రమ ప్రస్థానం మూసివేత దిశగా సాగింది. 2002లో దీన్ని ప్రైవేటీకరించారు. అప్పటి నుంచి నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి. తర్వాత ప్రభుత్వంలో దీనిపై ఒక కమిటీని నియమించారు. ఫ్యాక్టరీని ప్రభుత్వం టేకోవర్ చేయాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. కానీ అనంతర కాలంలో వైఎస్ మరణంతో అది అక్కడే ఆగిపోయింది. 2015 వరకు పరిశ్రమను నడిపిన యాజమాన్యం, నష్టాలు భరించలేని పరిస్థితుల్లో మూసివేసింది. 

మాట తప్పిన బీఆర్ఎస్.. 

బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెస్తామని ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. ఫ్యాక్టరీని తెరిపించాలని కార్మికులు, రైతులు అనేక ఉద్యమాలు చేస్తూ వచ్చారు. కంపెనీపై లేఆఫ్‌‌‌‌ ఎత్తివేయాలని రిలే దీక్షలు, ఆమరణ దీక్షలు చేశారు. రాజకీయ పార్టీలు సైతం వారికి మద్దతు ప్రకటించాయి. 

అలా బోధన్‌‌‌‌ నిజాం షుగర్స్‌‌‌‌ పరిశ్రమ అంశం కాలక్రమేణ రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచార హామీగా మారిపోయింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని 2018 ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రకటించారు. కానీ ఆ హామీని అమలు చేయలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుఆ దిశగా చర్యలు తీసుకుంది.