వైఎస్సార్ తెలంగాణ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపడుతున్న ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 193వ రోజుకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో పాదయాత్ర చేపడుతున్నారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో కొనసాగుతోంది. రెండో రోజు కోరుట్ల నియోజకవర్గంలో ఉదయం 10 గంటలకు మల్లాపూర్ మండంలం రాఘవ పేట్ నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. మల్లాపూర్ మండల పరిధిలోని హుస్సేన్ నగర్, ముత్యంపెట మీదుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ వద్దకు పాదయాత్ర చేరుకోనుంది. ఉదయం 11 గంటలకు నిజాం షుగర్స్ వద్ద మహాధర్నా చేపట్టనున్నారు.
నిజాం షుగర్స్ ను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కొనసాగనుంది. కోరుట్ల నియోజకవర్గంలో చెరుకు ఫ్యాక్టరీని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెరిపిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని షర్మిల నిలదీశారు. ధర్నా అనంతరం ముత్యంపేట కాలని, గూడూరు మీదుగా పాదయాత్ర కొనసాగించనున్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్, సంగెం, శ్రీరాంపూర్, దామరాజ్ పల్లి, మల్లాపూర్ మండల కేంద్రం మీదుగా కుస్తాపూర్, సిరిపూర్ రాఘవపేట గ్రామాల్లో కొనసాగింది. యాత్ర 2800 కి.మీకు చేరడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు షర్మిలకు ఘనస్వాగతం పలికారు.